సమన్వయంతో పనిచేయాలి

20 Dec, 2013 04:35 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్: ముక్కోటి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్నారు. జనవరి 10,11 తేదీల్లో భద్రాచలంలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం రామాలయ ప్రాంగణంలోని చిత్రకూటమండపంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
 
 ఉత్సవాలకు మూడు రోజుల ముందుగానే ఏర్పాట్లన్నీ పూర్తయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. సామాన్య భ క్తులే ఉత్సవాలకు వీఐపీలని, వారికి సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు.  ఉత్సవాల విశిష్టత, ఇక్కడ జరిగే కార్యక్రమాలు, అందజేసే సౌకర్యాలు గురించి భక్తులు పూర్తి స్థాయిలో   తెలుసుకునేందుకు పట్టణంలోని వీలైనన్ని చోట్ల ఎక్కువగా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. భద్రాచలం బస్టాండ్, ఉత్సవాల ప్రాంగణంలో పాటు, అవసరమైన చోట్ల మరుగుదొడ్లు, మూత్ర శాలలను నిర్మించాలన్నారు. వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక వసతి కేంద్రాలను నిర్మించాలన్నారు.
 
 వసతి కేంద్రాల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, తాగునీటి ఏర్పాట్లతో పాటు వైద్యశిబిరాలను కూడా అక్కడ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గతంలో ఉత్సవాల టిక్కెట్లు మిగిలిపోయినందున ఈసారి వాటిని ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తే బాగుంటుందని, దీనిపై తగు ఆలోచన చేయాలన్నారు. అదే విధంగా పట్టణంలో పది చోట్ల టిక్కెట్ల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి వీటిపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. గోదావరి నదిలో సరిపడా నీరు ఉన్నందున ఈసారి హంసవాహనంపైనే తెప్పోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ పనులు జనవరి 7 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 8న ట్రైయల్ రన్ నిర్వహించేందుకు హంస వాహనం సిద్ధం చేయాలని సూచించారు. ఉత్సవాల్లో పాల్గొనే అన్ని శాఖల ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. మరో  వారం రోజుల తరువాత ఏర్పాట్లపై  సమీక్షిస్తానని చెప్పారు.
 
 రుచికరమైన భోజనం పెట్టకపోతే హోటళ్లను సీజ్ చేయండి : పీవో వీరపాండియన్
 భక్తులకు రుచికరమైన భోజనం పెట్టని హోటళ్లను గుర్తించి వాటిని సీజ్ చేయాలని ఐటీడీఏ పీవో వీరపాండియన్ ఆదేశించారు. ఉత్సవాల సమయంలో కొంతమంది హోటళ్ల నిర్వాహకులు భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా ధరల దోపిడీ చేస్తున్నట్లు  తమ దృష్టికి వస్తోందని, దీనిపై ఆహార తనిఖీ అధికారులు తగు దృష్టి సారించాలన్నారు. సాధారణ రోజుల్లో ఎలాగూ పట్టించుకోరు....కనీసం ఉత్సవాల సమయంలోనైనా  హోటళ్లను తనిఖీ చేయండని సంబంధిత శాఖ అధికారులకు చురకలు వేశారు.   ఆహార తనిఖీ అధికారులు గత ఏడాది ఎన్ని కేసులు నమోదు చేశారనే దానిపై ప్రశ్నించగా సదరు అధికారులు నీళ్లు నమిలారు. ఈ సాైరె నా కాస్త దృష్టి సారించి పనిచేయాలని సూచించారు.
 
 ఉత్సవాలతో భద్రాద్రి అభివృద్ధి చెందాలి :  ఎస్పీ రంగనాథ్
 ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల ద్వారా భద్రాచలం మరింత అభివృద్ధి చెందే విధంగా తగు ప్రణాళికలు తయారు చేస్తే బాగుంటుందని జిల్లా ఎస్పీ రంగనాథ్ అన్నారు.   ఆయా శాఖల ద్వారా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు కాకుండా శాశ్వత ప్రయోజనాలు కలిగేలా చూడాలని అధికారులను కోరారు. భద్రాచలం బ్రిడ్జి ముఖ ద్వారంలో భక్తులకు  చెత్త కుప్పలు స్వాగతం పలకడం ఎంతమాత్రం సమంజసంకాదని, దీనిపై పంచాయతీ వారు ప్రత్యేక దృష్టి సారించి వాటిని అక్కడ నుంచి తరలించాలని సూచించారు.
 
 గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బారికేడ్లను సక్రమ పద్ధతిలో ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ఉత్సవాలను భక్తులంతా తిలకించే ందుకు ప్రధాన కూడళ్లలో ఎల్‌ఈడీలను, అలాగే భక్తులకు తగు సమాచారం అందించేందుకు ‘మే ఐ హెల్ప్‌యూ’ కౌంటర్‌లను  ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. ఈవో రఘునాథ్ దేవస్థానం ఆధ్వర్యంలో ఉత్సవాలకు చేపట్టే పనులను వివరించారు.  ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ, భద్రాచలం ఆర్‌డీవో వెంకటేశ్వర్లు, ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి,ఆలయ ప్రధానర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశం అనంతరం ఆయా శాఖల అధికారులతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. ఉత్తర ద్వారం, కరకట్ట తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
 

>
మరిన్ని వార్తలు