గుండెపోటుతో రైతు మృతి

28 Oct, 2013 03:48 IST|Sakshi

కారేపల్లి, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట వర్షార్పణం కావడంతో మనోవేదనతో గుండె పగిలి ఓ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని పేరుపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది.  మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన గడ్డికొప్పుల రామయ్య(52) తనకు ఉన్న మూడెకరాల పొలంలో మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అలాగే ఎకరా రూ. 8వేల చొప్పున మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని 3 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ఈ పంటల సాగు కోసం రూ. 1.20లక్షల అప్పు చేశాడు. ఈ మొత్తం, గత ఏడాది అప్పులు కలిపి మొత్తం రూ. 2లక్షల మేర అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఒలిచిన మొక్కజొన్న పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొలకలు వచ్చాయి. అలాగే పత్తి తడిసి ముద్దయింది. దీంతో అతను తీవ్ర మనోవేదనతో ఉన్నాడు.
 
 ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లి వచ్చిన రామయ్య ఇంటి ఎదుట ఆరబోసిన మొక్కజొన్నను చూశాడు. అవి మొలకలు వచ్చి ఉండడంతో మనస్తాపంతో దానిపై పడి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య రామనర్సమ్మ, కుమారులు ఉపేందర్, శ్రీహరి ఉన్నారు. కుమార్తె నాగలక్ష్మికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెద్ద కుమారుడు ఉపేందర్ 9వ తరగతి వరకు చదివి తండ్రికి వ్యవసాయంలో సహాయపడుతున్నాడు. చిన్న కుమారుడు పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మృతుడికి వృద్ధురాలైన తల్లి శాంతమ్మ ఉంది. ఇంటి పెద్ద గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. సంఘటన స్థలానికి పేరుపల్లి వీఆర్వో గుమ్మడి రాములు సందర్శించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు