హెలెన్ తుపాన్‌తో రైతులకు కష్టాలు

24 Nov, 2013 00:03 IST|Sakshi

 కందుకూరు, న్యూస్‌లైన్:  హెలెన్ తుపాన్ కారణంగా మండలంలో శనివారం తెల్లవారుజాము నుంచి ముసురు వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లో ఎండబెట్టిన మొక్కజొన్న, వరి పంటను తడవకుండా కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం వర్షంలోనే బస్తాల్లో నింపిన గింజల్ని ఆయా గ్రామాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపిస్తే అక్కడకు చేర్చి దక్కించుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు రైతులు. దేవాలయాలు, కమ్యూనిటీ భవనాలు వంటి వాటిల్లో నిల్వ చేసుకుంటున్నారు. స్థలం అందుబాటులో లేని రైతులు వర్షానికి తడవకుండా పట్టలు కప్పి ఉంచారు. మరోరోజు ఇలాగే ముసురు కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

 పట్టలు కప్పి ఉంచడంతో పూర్తిగా ఎండని మక్కలకు ఫంగస్ వచ్చే అవకాశం ఉండటం, కోతకు వచ్చిన వరి పైరు పొలంలోనే మొలకె త్తేలా ఉండటం, పత్తి నల్లగా మార నుండటం, కూరగాయ పంటలు దెబ్బతినే అవకాశం ఉందని వాపోతున్నారు. మరోవైపు చేతికొచ్చిన మొక్కజొన్న పంటను అమ్ముకోలేక ఆవేదన చెందుతున్నారు. డిమాండ్ మేర మార్క్‌ఫెడ్ నుంచి రోజూ పది లారీలు పంపాల్సి ఉండగా ప్రస్తుతం వారం నుంచి అడపాదడపా ఒక్కటి, రెండు లారీలు మాత్రమే పంపిస్తున్నారు. ఈ నెల 16 నుంచి ఇప్పటి వరకు కేవలం 7 లారీలు మాత్రమే పంపించారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది. దీంతో పీఏసీఎస్ గోదాంలతో పాటు గ్రామాల్లో మక్కల నిల్వలు పేరుకుపోయాయి. బయటి మార్కెట్లో విక్రయిద్దామన్నా వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించడంతో పాటు డబ్బును నెల తర్వాత ఇస్తామనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
 తడిసి ముద్దయిన పత్తి
 పూడూరు: హెలెన్ తుపాన్ ప్రభావంతో పత్తి తడిసి ముద్దయింది. మండలంలో శనివారం మధ్యాహ్నం పూడూరు, రాకంచర్ల, మంచన్‌పల్లి, కంకల్, పెద్ద ఉమ్మెంతాల గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. తెంపేందుకు సిద్ధంగా ఉన్న పత్తి పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన పత్తి నేలకు జారి మట్టిపాలైంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మొక్కజొన్న పంటలు పోయినా కనీసం పత్తిలోలైనా లాభాలు వస్తాయనుకుంటే ఈ పంట కూడా హెలెన్ తుపాన్ ప్రభావం ముంచేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు