ఇందిరేశ్వరంలో గుడిసెలు దగ్ధం

10 Jan, 2014 02:10 IST|Sakshi

 ఇందిరేశ్వరం (ఆత్మకూరురూరల్), న్యూస్‌లైన్: నల్లమల్ల అభయారణ్య ప్రాంత పరిధిలోని ఇందిరేశ్వరం గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఐదు గుడిసెలు కాలిపోయాయి. గ్రామానికి చెందిన రమిజాబీ, జిలాని, కతిజాబీ, పఠాన్‌అలీ, మాబున్నీ వారివారి కుటుంబీకులతో కలిసి బుధవారం రాత్రి భోజనం తర్వాత నిద్రకు ఉపక్రమించారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాత్రి పొద్దుపోయాక మంటలు చెలరేగి ఒకదాని తర్వాత మరో గుడిసెకు వ్యాపించాయి. సెగ తగలడంతో గమనించి బాధితులు తలుపులు తీసుకుని బయటపడ్డారు.

మంటల్లోనే ఉండిపోయిన రహ్మత్ అనే బాలింతను స్థానికులు రక్షించారు. తన కూతురు వివాహం కోసం తెచ్చుకున్న నగలు, దాచుకున్న డబ్బు, పది బస్తాల బియ్యం, ఇంటి సామగ్రి పూర్తిగా కాలిబూడిదైందని రమీజాబి కన్నీరు పెట్టుకుంది. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది అక్కడకు వచ్చి పరిశీలించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు