నేదురుమల్లి స్థానానికి ఉపఎన్నిక

13 Jun, 2014 01:39 IST|Sakshi
నేదురుమల్లి స్థానానికి ఉపఎన్నిక

జూలై 3న నిర్వహణ  షెడ్యూలు జారీ చేసిన ఈసీ
 
 ఏపీ నుంచి నిర్మలా సీతారామన్!
 పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రాతినిధ్యం లేనప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా అవకాశం లభించిన బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్‌ను ప్రస్తుతం ఏపీ నుంచి ఖాళీ అయిన స్థానం నుంచి రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే బీజేపీకి, టీడీపీకి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం.
 
 హైదరాబాద్/న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం షెడ్యూలును ప్రకటించింది. జూలై 3న ఎన్నిక నిర్వహిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఈ నెల 16న జారీ చేయనుంది. 23వ తేదీ వరకు నామినేషన్లకు గడువుంది. 24న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ తుదిగడువు. అవసరమైన పక్షంలో ఎన్నికను జూలై 3వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లకు కేటాయిస్తూ రాజ్యసభ సచివాలయం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కేటాయింపులో నేదురుమల్లి ప్రాతినిధ్యం వహించిన స్థానం ఆంధ్రప్రదేశ్ కోటాలోకి వెళ్లింది. సుదీర్ఘ అస్వస్థత కారణంగా నేదురుమల్లి మే 9వ తేదీన కన్నుమూయడం తెలిసిందే. అయితే ఆయన పదవీకాలం 2016 జూలై 21 వరకు ఉంది. ఆయన మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఇప్పుడు ఉపఎన్నిక నిర్వహిస్తుండగా, ఈ స్థానం నుంచి గెలుపొందే సభ్యుని పదవీ కాలపరిమితి మిగిలిన ఒక ఏడాది 11 నెలలు మాత్రమే ఉంటుంది.

దేశవ్యాప్తంగా మరో మూడు రాజ్యసభ స్థానాలకూ ఎన్నికల షెడ్యూలు..

 ఇదిలా ఉండగా నేదురుమల్లి మరణంతో ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన స్థానంతోపాటు దేశవ్యాప్తంగా మరో మూడు రాజ్యసభ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూలును ప్రకటించింది. టీఎం సెల్వగణపతి(తమిళనాడు) అనర్హతకు గురికావడం, ఒడిశాకు చెందిన శశిభూషణ్ బెహ్రా, రాబినారాయణ్ మహాపాత్ర లిద్దరూ రాజీనామా చేసిన కారణంగా ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.
 
 

మరిన్ని వార్తలు