కరెంటోళ్ల కర్కశత్వం!

18 Dec, 2013 03:11 IST|Sakshi

అనంతగిరి, న్యూస్‌లైన్: నారు మడి ఎండుతోంది.. పది దినాలు ఆగితే వడ్ల పైసలు వస్తయ్.. మీకిచ్చేది ఇచ్చేస్తాం.. అంటూ అన్నదాతలు కాళ్లావేళ్లా పడుతున్నా అధికారులు కనికరించడం లేదు. నారు మడులు ఎండుతున్నా.. రైతన్న కన్నీళ్లు పెట్టుకుంటున్నా బోరు మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొనిఉంది. వికారాబాద్ మండలం గొట్టిముక్కుల గ్రామంలో దాదాపు 50 నుంచి 60 మంది రైతులకు చెందిన బోరు, బావులకు సంబంధించిన మోటార్లకు అధికారులు వారం క్రితం విద్యుత్ సరఫరా నిలిపేశారు.
 
 దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వరుస తుపాన్లు, చీడపీడల కారణంగా గత పంటంతా నష్టపోయామని, చేతికందిన కొద్ది మొత్తం అమ్ముకున్నా.. ఇంకా డబ్బులు చేతిలో పడలేదని రైతులు వాపోతున్నారు. పంట డబ్బులు కనీసం పెట్టుబడికైనా వస్తాయనుకుంటే అధికారులు అదునుచూసి సర్వీస్ చార్జీల కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గొట్టిముక్కల గ్రామంలో 60 ఎకరాల్లో వరితోపాటు పత్తి, పసుపు తదితర పంటలు సాగవుతున్నాయి. పక్షం రోజుల క్రితం చాలా మంది రైతులు నార్లు పోసుకున్నారు. అయితే వారం క్రితమే అధికారులు బోర్లకు విద్యుత్ కనెక్షన్ తీసేశారు. దీంతో నారుమడులు ఎండుముఖం పట్టాయి. మూడు నాలుగు కిస్తీల్లో డబ్బులు చెల్లిస్తామని మంగళవారం గ్రామానికి వచ్చిన విద్యుత్ అధికారుల వద్ద రైతులు మొరపెట్టుకున్నారు. అయితే మొత్తం చెల్లిస్తేనే కనెక్షన్ ఇస్తామని ఖరాకండీగా చెప్పారని రైతులు చెప్పారు.
 
 ఇక మంచాల మండలం ఆరుట్లలో ఇటీవల విద్యుత్ బిల్లులు చెల్లించలేదని వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా చేసే లైన్‌ను ట్రాన్స్‌కో అధికారులు తొలగించారు. అధికారుల నిర్వాకంతో బిల్లులు చెల్లించిన 17 మంది రైతులకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయి పంటలు ఎండిపోయాయి. పరిగి, నవాబుపేట, మర్పల్లి, బంట్వారం తదితర ప్రాంతాల్లోనూ రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కరెంటోళ్లు మా బతుకులు ఆగం చేస్తున్నారని మండిపడుతున్నారు. సర్వీసు చార్జీల విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డబ్బుల చెల్లింపునకు వ్యవధి ఇవ్వాలని, లేకుంటే వాయిదాల రూపంలో వసూలుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.  
 
 రైతు గురించి ఆలోచించాలి..
 వరి నారు పోద్దామని వారం క్రితం భూమి దున్నిన. అధికారులు వచ్చి విద్యుత్ కనెక్షన్ తీసేశారు. తెచ్చుకున్న విత్తనాల వడ్లు పాడయినై. అదను దాటుతోంది. అధికారులు రైతుల గురించి ఆలోచించాలి. విడతల వారీగా వసూలు చేసుకోవాలి.  
 - శ్రీనివాస్, రైతు
 
 అధికారులు స్పందించాలి
 ఇటీవలే నారు పోసిన. వారం క్రితమే కరెంట్ కట్ చేశారు. మడంతా ఎండుముఖం పట్టింది. చెల్లించాల్సిన మొత్తం రెండు, మూడు విడతల్లో తీసుకోమ్మన్నం. విన్పించుకుంటలేరు. ఉన్నతాధికారులు స్పందించాలి. లేకపోతే నిండా మునుగుతాం.
 - శ్రీశైలం, రైతు

మరిన్ని వార్తలు