పెద్దయ్యవార్లేరీ?

28 Nov, 2013 03:15 IST|Sakshi

సాక్షి, అనంతపురం : రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గ పరిధిలోని సలకంచెరువు జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు(హెచ్‌ఎం) చెండ్రాయుడు శింగనమల ఇన్‌చార్జ్ ఎంఈఓగా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈయన వారంలో రెండు రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లి వస్తుంటారు. 325 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో 64 మంది పదో తరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న సమయంలో వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు కరువయ్యారు. దిశానిర్దేశం చేయాల్సిన హెచ్ ఎం... అదనపు బాధ్యతలతో ఎక్కువగా శింగనమలకే పరిమితమవుతున్నారు. దీంతో పాఠశాలలో విద్యాబోధన గతి తప్పుతోంది.


 యాడికి మండలం చందన జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం కె.చిన్నపెద్దయ్య ఆ మండల ఎంఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారంలో ఒక్కరోజు మాత్రమే.. అదీ ఓ అరగంట చుట్టపు చూపుగా పాఠశాలకు వెళ్తుంటారు. ఈ పాఠశాలలో 168 మంది విద్యార్థులున్నారు. వీరిలో 33 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరికి గణితం సబ్జెక్టును చిన్నపెద్దయ్యే బోధించాల్సి ఉంది. ఆయన అటువైపు వెళ్లకపోవడంతో మరో టీచర్ ఆ బాధ్యత తీసుకున్నారు. దీనికితోడు పాఠశాల నిర్వహణ కూడా గాడి తప్పుతోంది.
 
 గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల జెడ్పీ హైస్కూల్ హెడ్‌మిసెస్ బి.యామినిబాల ఇన్‌చార్జ్ ఎంఈఓగానూ వ్యవహరిస్తున్నారు. అనంతపురంలో నివసిస్తున్న ఆమె గార్లదిన్నెకు వెళ్లి అదనపు బాధ్యతలు చూసుకోవడానికే సమయం సరిపోతోంది. దీంతో పాఠశాలకు అప్పుడప్పుడు మాత్రమే వెళ్లి వస్తుంటారు. పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మొత్తం 151 మంది విద్యార్థులుండగా.. 42 మంది పదో తరగతి చదువుతున్నారు. హెచ్‌ఎం పాఠశాలకు సరిగా వెళ్లకపోవడంతో విద్యాబోధన కుంటుపడుతోంది. హెచ్‌ఎం బోధించాల్సిన సోషియల్ సబ్జెక్టును మరో ఉపాధ్యాయిని అదనంగా చెప్పాల్సి వస్తోంది.
 
 పై మూడు పాఠశాలల్లోనే కాదు.. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి. ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా వ్యవహరిస్తున్న హెచ్‌ఎంలు పాఠశాలలపై దృష్టి సారించడం లేదు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతుండడంతో ఇప్పటికైనా వారు పాఠశాలల వైపు చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,900 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 545 ఉన్నత పాఠశాలలు. వీటిలో 4.10 లక్షల మంది చదువుతున్నారు. ఒక్క పదో తరగతిలోనే 50 వేలకు పైగా ఉన్నారు. జిల్లాలోని 63 మండలాలకు గాను 14 మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలిన 49 మండలాలకు సీనియర్ హెచ్‌ఎంలను ఇన్‌చార్జ్ ఎంఈఓలుగా ఎఫ్‌ఏసీ (ఫుల్ అడిషనల్ చార్జ్) హోదాలో నియమించారు.
 
 దీన్ని సాకుగా చూపి పలువురు పాఠశాలల వైపు కన్నెత్తి చూడడం లేదు. నెలల తరబడిపాఠశాలలకు వెళ్లని దాఖలాలూ ఉన్నాయి. మండల విద్యాశాఖ కార్యాలయాలకే పరిమితమవుతున్నారు. సమీక్షలు, తనిఖీలు, సమాచార పంపిణీ...ఇలా బోలెడు సాకులు చెబుతూ పాఠశాలలను మరచిపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకం, ఉపాధ్యాయ వేతనాల బిల్లులపై సంతకాలు చేయడానికి మాత్రమే పాఠశాలలకు వెళ్తున్నారు.

అదే సందర్భంలో హాజరు పట్టికలో సంతకాలు చేసి వస్తున్నారు. దీనివల్ల ఆయా పాఠశాలల్లో నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తి కావస్తున్నా పూర్తి స్థాయిలో పుస్తకాలు, యూనిఫాం అందలేదు. నిధులకు లెక్కలు కూడా సక్రమంగా ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆ సంగతి అలా ఉంచితే.. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు నాలుగు నెలల సమయం కూడా లేదు. ఈ సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ఈ తరగతులు సజావుగా సాగాలంటే హెచ్‌ఎంలు అందుబాటులో ఉండాలి. నిత్యం ఉపాధ్యాయులతో మమేకమై విద్యార్థులను గాడిలో పెట్టేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం 49 హైస్కూళ్లలో ఆ పరిస్థితి లేదు. దీంతో  పదో తరగతి విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.
 
 పాఠశాలలో గంటైనా గడపాలి
 ఎంఈఓలుగా అదనపు బాధ్యతలు చూస్తున్న హెచ్‌ఎంలు ప్రతి రోజూ తప్పనిసరిగా వారి పాఠశాలలకు వెళ్లాలి. కనీసం గంట సేపైనా గడపాల్సిందే. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. పదో తరగతి ఉత్తీర్ణత ఏ మాత్రం తగ్గినా.. వారిదే బాధ్యత. మరీ అంత బిజీగా ఉంటే రోజుమార్చి రోజైనా వెళ్లాలి. లేదంటే చర్యలు తీసుకుంటాం. -మధుసూదన్‌రావు, జిల్లా
  విద్యా శాఖాధికారి (డీఈఓ), అనంతపురం
 

>
మరిన్ని వార్తలు