రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

15 Dec, 2013 03:23 IST|Sakshi
పెందుర్తి రూరల్, న్యూస్‌లైన్:పెందుర్తి-అనకాపల్లి ప్రధాన రోడ్డులో రైల్వే వంతెన సమీపాన సిటీ బస్సును భారీ ట్రాలర్ ఢీకొట్టిన ప్రమాదంలో విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఇతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పెందుర్తి పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. సబ్బవరం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వెళ్లే 300 నంబర్ సిటీ బస్సు రైల్వే వంతెన దిగుతోంది. అదే సమయంలో ఎదురుగా ఫ్యాబ్రికేటింగ్ యాంగలర్‌తో వస్తున్న భారీ ట్రాలర్ ఆగివున్న లారీని తప్పించే ప్రయత్నంలో బస్సు వెనుక భాగాన కుడివైపున బలంగా ఢీకొట్టింది.
 
 ట్రాలర్‌పై ఉన్న యాంగలర్ బస్సు కుడివైపు అద్దంలోంచి ఓ వైపు ధ్వంసం చేస్తూ దూసుకు పోవడంతో వెనుక సీట్లో కూర్చున్న కిలాడి ఆనందరావు(17) అనే విద్యార్థి అక్కడికక్కదే దుర్మరణం పాల య్యాడు. ఆ పక్క సీట్లో కూర్చున్న శీరంరెడ్డి కిరణ్ కుడిచేయి, తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థాని కులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు. మృతుడిది విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దెందేరు సంతపాలెం గ్రామం. సబ్బవరంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న తండ్రి అప్పారావును కలిసి తిరిగి పెందుర్తిలోని కళాశాలకు వెళ్లేం దుకు బస్సులో వస్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రుడు కిరణ్‌ది చోడవరం మండలం లక్కవరం గ్రామం. ట్రాఫిక్ ఎస్‌ఐ కొండలరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
 108 రాక స్థానికులు ఆగ్రహం
 ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు 108కి సమాచారం అందించినా గంట వరకూ వాహనం రాలేదు. దీంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. క్షతగాత్రుని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానికులు చొరవ తీసుకుని అతన్ని ఆస్పత్రికి తరలించారు. రోడ్డు విస్తరణ జరగక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అయినా అధికారులు స్పందించక పోవడం దారుణమని స్థానికులు వ్యాఖ్యానించారు.
 
మరిన్ని వార్తలు