రోదసికి రెండోసారి కోతిని పంపిన ఇరాన్! | Sakshi
Sakshi News home page

రోదసికి రెండోసారి కోతిని పంపిన ఇరాన్!

Published Sun, Dec 15 2013 3:23 AM

రోదసికి రెండోసారి కోతిని పంపిన ఇరాన్!

అణ్వస్త్ర ప్రయోగ సామర్థ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్న ఇరాన్.. రోదసికి రెండోసారి కోతిని పంపి సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చినట్లు శనివారం ప్రకటించింది. ఈ ప్రయోగంలో విజయం సాధించిన శాస్త్రవేత్తలను అధ్యక్షుడు హసన్ రౌహానీ అభినందించారని ఇరాన్ అధికార వార్తా సంస్థ ‘ఐఆర్‌ఎన్‌ఏ’ తెలిపింది. పజోహెష్ రాకెట్ ద్వారా ఫర్గామ్ (శుభప్రదం) అనే కోతిని కక్ష్యలోకి పంపి భూమికి తిరిగి ప్రాణాలతో తీసుకువచ్చినట్లు అధ్యక్షుడు తన సందేశంలో పేర్కొన్నారు.

అయితే ఈ ఏడాది జనవరిలోనూ ఇరాన్ ఇలాంటి ప్రయోగాన్నే చేపట్టినా.. అది వివాదాస్పదమైంది. పిష్గామ్ (మార్గదర్శి) అనే కోతిని రోదసికి పంపి సురక్షితంగా భూమికి తెచ్చినట్లు ప్రకటించిన ఇరాన్.. మీడియా ముందుకు మాత్రం వేరే కోతిని తీసుకురావడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. తొలిసారిగా 2011 సెప్టెంబర్‌లో ఇరాన్ ఇలాంటి ప్రయోగానికి ప్రయత్నించి విఫలమైంది.
 

Advertisement
Advertisement