రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

25 Nov, 2014 03:09 IST|Sakshi

కళ్యాణదుర్గం రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మరణించాడు. ఘటనకు సంబంధించి వైద్యులు సకాలంలో స్పందించలేదంటూ బంధువులు ఆస్పత్రికి తాళం వేసి ధర్నా చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే... కళ్యాణదుర్గానికి చెందిన మధు(18), సాయితేజా స్నేహితులు. వీరు పరుశురాం పురంలోని బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై ఆదివారం బయలుదేరారు.

శెట్టూరు మండల పరిధిలోని అడవిగొల్లపల్లి వద్ద మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డారు. ఘటనలో మధు తలకు బలమైన గాయమైంది. సాయితేజా కూడా గాయపడ్డాడు. వీరిని 108 వాహనంలో మధ్యాహ్నం 12.30 గంటలకు కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. మధును పరీక్షించిన వైద్యుడు రంగనాథ్ వెంటనే జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు.

అదే సమయంలో ఆస్పత్రిలో ఉన్న అంబులెన్‌‌సకు డ్రైవర్ అందుబాటులో లేడంటూ గంటపాటు ఆలస్యమైంది. క్షతగాత్రుడి పరిస్థితి విషమిస్తుండడంతో ఓ ప్రైవేట్ అంబులెన్‌‌సలో అనంతపురానికి కుటుంబసభ్యులు తరలించారు. ఆత్మకూరు వద్దకు చేరుకోగానే మధు మరణించాడు. దీంతో వృుతదేహాన్ని తీసుకుని కళ్యాణదుర్గం చేరుకున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రికి తాళం వేసి బైఠాయించారు.

సమాచారం అందుకున్న ఎస్‌ఐ జయనాయక్, సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. వృుతుడి తల్లిదండ్రులు, బంధువులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. ఘటనపై శెట్టూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు