సీనియర్‌ పైలట్‌ ఘనకార్యం: తృటిలో తప్పిన ప్రమాదం

11 May, 2019 16:03 IST|Sakshi

కో-పైలట్ మాట వినకుండా విమానాన్ని నడిపిన సీనియర్ పైలట్ 

డ్రైనేజీలోకి దూసుకెళ్లిన ఎయిర్ ఇండియా విమానం 

 రెండేళ్ల డీజీసీఏ విచారణలో వెలుగు చూసిన వైనం

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ఇద్దరు  పైలట్ల మధ్య ఈగో సమస్య  వివాదం  రేపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందులోనూ తన కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళా కో-పైలట్ సూచనలు వినడానికి ఓ సీనియర్  మగ పైలట్  ససేమిరా ఇష్టపడలేదు. ఆఫ్టర్‌ ఆల్‌ ఓ మహిళ చెబితే తాను వినాలా అనుకున్నాడో ఏమో కానీ.. మూర్ఖంగా ప్రవర్తించాడు..అత్యవసర సమయంలో మహిళా సహ పైలట్‌ హెచ్చరికలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా విమానాన్ని పెద్ద ప్రమాదంలోకి  నెట్టాడు. అయితే దురదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగనప్పటికీ... తీవ్ర ఆందోళనకు దారి తీసింది.  2017లో  జరిగిన  ఈ ఘటనపై జరిపిన విచారణలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. 

102 మంది ప్రయాణికులతో అబుదాబి నుంచి కోచికి బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఐఎక్స్‌ 452 విమానం వాతావరణం అనుకూలించక పోవడంతో క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. భారీ వర్షం వల్ల పైలట్లకు రన్‌వే కనిపించలేదు. దీంతో విమానం రన్‌వే మీద నుంచి రైన్ వాటర్ డ్రైనేజీలోకి జారుకుంది. ఫలితంగా విమాన చక్రాలు డ్రైనేజీలో ఇరుక్కున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో అధికారుల్లో, ప్రయాణీల్లో తీవ్ర ఆందోళనకుదారితీసిన ఈ ఘటనపై సీనియర్‌ అధికారులు విచారణకు ఆదేశించింది. 

ఈ ఘటనపై విచారణ జరిపిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. విమానం కమాండింగ్ బాధ్యతల్లో ఉన్న సీనియర్ పైలట్‌దే తప్పని తేల్చింది. తన కంటే 30 ఏళ్ల వయస్సు తక్కువున్న కో-పైలట్ హెచ్చరికలను పట్టించుకోకుండా విమానాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది. 

భారీ వర్షం వల్ల విమానం రన్‌వే మార్క్స్ కనిపించడం లేదని, విమానాన్ని కాస్త నెమ్మదిగా నడపాలని కో-పైలట్.. సీనియర్ పైలట్‌ను కోరింది. అయితే, ఆమె మాటలు వినకుండా మొండిగా విమానాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో డీజీసీఏ..ఈ మగ పైలట్‌ లైసెన్సును మూడు నెలలపాటు రద్దు చేసింది.

మరిన్ని వార్తలు