14 ఏళ్లలో మొదటిసారి : ఎయిర్‌టెల్‌కు షాక్‌

1 Aug, 2019 18:21 IST|Sakshi

సాక్షి, ముంబై : టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారీ నష్టాలను నమోదు చేసింది. గురువారం మార్కెట్‌ ముగిసిన అనంతరం ప్రకటించిన  క్యూ1 పలితాల్లో రూ.2,866 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.  గత ఏడాది  ఇదేకాలంలో రూ. 97 కోట్ల నికర లాభం నమోదు కావడం గమనార్హం. 14 సంవత్సరాలలో కంపెనీకి ఇది మొదటి త్రైమాసిక నష్టమని ఎనలిస్టులు తెలిపారు. జియో ఎంట్రీతో భారతి ఎయిర్‌టెల్‌ ఎదుర్కొంటున్న  ఒత్తిడితోపాటు, వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు  ఇతర టెలికాం కంపెనీల నిరంతర పోరాటాన్నిఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు.

ఏకీకృత ఆదాయం జూన్ త్రైమాసికంలో సంవత్సరానికి 4.7శాతం పెరిగి, రూ. 20,738 కోట్లకు చేరుకుంది. వైర్‌లెస్ వ్యాపార ఆదాయం సంవత్సరానికి 4.1శాతం పెరిగి రూ. 7 10,724 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్‌ ఆదాయం రూ. 11,270 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయంలో ఎయిర్‌టెల్‌ను అధిగమించిన జియో రూ. 11,679  ఆపరేటింగ్‌ రెవెన్యూను సాధించింది. ఎబిటా మార్జిన్లు ఈ త్రైమాసికంలో 6.4 శాతం పెరిగి 41 శాతానికి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 34.5 శాతంగా ఉంది.

అన్ని వ్యాపారాల్లో ఆరోగ్యకరమైన వృద్ధితో ఈ సంవత్సరం మొదటి త్రైమాసికం ప్రారంభమైందని ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్ విట్టల్ చెప్పారు. రివార్డ్ ప్లాట్‌ఫామ్, ఎయిర్‌టెల్ థాంక్స్ ద్వారా వినియోగదారులకు మరింత విలువను అందించడంపై  దృష్టి పెట్టామన్నారు. దీంతో వినియోగదారునికి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ)లో వరుసగా రెండవ త్రైమాసికంలో కూడా పుంజుకుందన్నారు.  నాన్‌మొబైల్‌ బిజినెస్‌ వృద్ధి సాధించిందని ఫలితాల సందర్భంగా ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. డిజిటల్ టివి ఆదాయం 15.7 శాతం వృద్ధిని సాధించిందనీ,  ఎయిర్టెల్ బిజినెస్ 7.2 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎబిటా 24.2 శాతం పెరిగి, రూ .8,493 కోట్లతో కన్సాలిడేటెడ్ మార్జిన్‌ సాధించినట్టు చెప్పింది. 

కాగా గతవారం జియో మొదటిసారిగా దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్‌ను అధిగమించి టాప్‌ లోకి దూసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆదాయపరంగా, వినియోగదారులపరంగా ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో మొదటి స్థానంలో ఉంది.  మరోవైపు  గురువారం  భారతి ఎయిర్‌టెల్‌ షేరు 4.1శాతం నష్టాలతో 323.95 వద్ద ముగిసింది. 

మరిన్ని వార్తలు