కస్టమర్ల చాయిస్‌ స్మార్ట్‌ హోమ్స్‌

16 Mar, 2019 01:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గృహ నిర్మాణ రంగంలో స్మార్ట్‌ హోమ్స్‌ డిమాండ్‌ శరవేగంగా పెరుగుతుంది. ఇల్లు, ఇంట్లోని ప్రతి వస్తువూ పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానమై ఉండాలని కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం దేశీయ స్మార్ట్‌ హోమ్స్‌ మార్కెట్‌ 893 మిలియన్‌ డాలర్లుగా ఉందని.. వచ్చే ఐదేళ్లలో 9.5 శాతం వృద్ధి చెందుతుందని పూర్వాంకర ఎండీ ఆశీష్‌ పూర్వాంకర అంచనా వేశారు. గత దశాబ్ద కాలంగా డెవలపర్ల దృక్పథాన్ని మార్చిన పలు అంశాలను ఆయన చర్చించారు. అవేంటంటే.. 

దేశంలో ఈ–కామర్స్‌ కంపెనీల సక్సెస్‌తో రియల్టీ రంగంలోకి కూడా స్టార్టప్స్‌ ఎంట్రీ ఇచ్చాయి. దశాబ్ద కాలంగా ప్రాపర్టీ క్రయ విక్రయాలు, నిర్వహణ సేవలను అందించే కంపెనీలు జోరందుకున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ హోమ్స్‌ ట్రెండ్‌ నడుస్తుంది. ఇల్లు, ఇంట్లోని ప్రతి వస్తువూ ఇంటర్నెట్, రిమోట్‌ కంట్రోల్‌తో నడిచే విధంగా ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు సౌకర్యవంతంగాను, ఎంటర్‌టైన్‌మెంట్, భద్రత కలిగిస్తుంది. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఇంటిని, ఇంట్లోని ప్రతి వస్తువును ఆపరేట్‌ చేసే వీలుంటుంది. 

గత పదేళ్లలో రియల్టీ పరిశ్రమ డిజిటల్‌ వైపు మళ్లింది. నిర్మాణాల్లో డేటా అనలిటిక్స్, డేటా మైనింగ్, ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), మిషన్‌ లెర్నింగ్‌ వంటి ఆటోమేటెడ్‌ టెక్నాలజీల వినియోగంపై దృష్టిసారించారు. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి మెట్రో నగరాల నుంచి పుణె, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూరు వంటి నాన్‌–మెట్రో నగరాల వైపు డెవలపర్లు దృష్టిసారిస్తున్నారు. 

►నిర్మాణ సామగ్రి, డిజైన్, టెక్నాలజీ అన్నింట్లోనూ డెవలపర్లు పర్యావరణహితమైనవి కోరుకుంటున్నారు. డిజైన్‌తో పాటూ నిర్మాణ సామగ్రి వినియోగంలోనే గ్రీన్‌ ఉత్పత్తులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో గత పదేళ్లలో నిర్మాణ రంగంలో గ్రీన్‌ టెక్నాలజీ పెట్టుబడులు మూడింతలు పెరిగాయి. సీనియర్‌ సిటిజన్స్, సింగిల్‌ ఉమెన్, సింగిల్‌ ఓనర్స్‌ ఇలా సమాజంలో ప్రతి ఒక్కరి అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా వేర్వేరు నివాస ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నారు. ఆయా వయస్సు, లింగ భేదాలకు తగ్గట్లుగా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నారు. 

►ఈ మధ్య కాలంలో అఫడబుల్‌ విభాగానికి విపరీతమైన డిమాండ్‌ వస్తుంది. దీంతో చిన్న, పెద్ద డెవలపర్లు అందరూ అఫడబుల్‌ ప్రాజెక్ట్‌ల మీద దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వ పన్ను రాయితీలు, వడ్డీ మినహాయింపుల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు సొంతింటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. 

>
మరిన్ని వార్తలు