భారత్‌ పన్నుల రాజేమీ కాదు

22 Apr, 2019 05:26 IST|Sakshi

కొన్ని రంగాలను కాపాడుకునే హక్కు ఉంది

నిపుణుల అభిప్రాయాలు

న్యూఢిల్లీ: భారత్‌ టారిఫ్‌ల విషయంలో కింగ్‌ (రాజు) ఏమీ కాదని, వ్యవసాయం వంటి కీలకమైన రంగాల ప్రయోజనాలను కాపాడుకునే హక్కు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌ దిగుమతుల సుంకాలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నాయన్న అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతూ... అభివృద్ధి చెందిన జపాన్, దక్షిణ కొరియా, ఈయూ, అమెరికా సైతం అధిక టారిఫ్‌లను వ్యవసాయ ఉత్పత్తులపై కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారత్‌ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు మోపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తరచూ ఆరోపిస్తున్న విషయం గమనార్హం. ‘‘అమెరికా ఆరోపణలు పూర్తిగా అసత్యం. అమెరికాలో పొగాకు దిగుమతులపై 350 శాతం, వేరుశనగలపై 164 శాతం టారిఫ్‌లు ఉన్నాయి.

వారు సైతం సహేతుక స్థాయిలో అధిక టారిఫ్‌లను నిర్వహిస్తున్నారు’’ అని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఎకనమిక్స్‌ ప్రొఫెసర్‌ బిశ్వజిత్‌ ధార్‌ అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) ప్రొఫెసర్‌ రాకేశ్‌ మోహన్‌ జోషి సైతం ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమెరికా ఆరోపణలు సరైనవి కావని, అభివృద్ధి చెందిన దేశంగా ముందు తన డ్యూటీలను క్రమబద్ధీకరించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడేది వాస్తవాలు కాదని ట్రేడ్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మోహిత్‌సింగ్లా పేర్కొన్నారు. ‘భారత్‌ కంటే అధిక టారిఫ్‌లను అమలు చేస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై జపాన్‌ 736 శాతం, దక్షిణ కొరియా 807 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాయి’ అని సింగ్లా  చెప్పారు.
 

మరిన్ని వార్తలు