-

దాడులు ప్రతికూలమేమీ కాదు..

30 Sep, 2016 01:01 IST|Sakshi
దాడులు ప్రతికూలమేమీ కాదు..

కఠినంగా వ్యవహరించాల్సిన తరుణమే 
పాక్‌పై కేంద్రం విధానానికి పారిశ్రామిక రంగం మద్దతు

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముష్కర మూకరులపై భారత ఆర్మీ చేసిన దాడులకు దేశీయ పారిశ్రామిక రంగం సైతం బాసటగా నిలిచింది. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఇదని, దేశీయ ఆర్థిక రంగం, వాణిజ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది.

కఠినంగా వ్యవహరించాలి..
నాగరిక భావాలు కలిగివున్నందున, మనం గతంలో (ఉడి ఆర్మీ శిబిరంపై జరిగిన దాడులు వంటివాటికి) ప్రతిదాడులు చేయలేదు.  కానీ ప్రస్తుతం గట్టిగా సమాధానమివ్వాల్సివుంది.  - కిరణ్ మజుందార్‌షా, సీఎండీ, బయోకాన్

కొంత అనిశ్చితి...
వాణిజ్య రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత సానుకూల దేశం హోదాను సమీక్షించాలన్న నిర్ణయం... భవిష్యత్తు వాణిజ్యంపై ఎగుమతి దారులను కొంత అనిశ్చితికి గురి చేసింది. - అజయ్ సహాయ్, డెరైక్టర్ జనరల్. ఎఫ్‌ఐఈవో

ఏం చేయాలన్నది ఆర్మీకి తెలుసు..
ఆర్మీపై విశ్వాసం ఉంది. ఉరీ దాడి నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి, ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్నది వారికి తెలుసు.
-  ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా

ఆటు పోట్లు స్వల్పమే..
ఆటుపోట్లు కూడా స్వల్ప కాలమే. దేశం నుంచి పాకిస్తాన్ ఎగుమతులు 2.17 బిలియన్ డాలర్లు మాత్రమే. మొత్తం ఎగుమతుల్లో ఇవి 0.83%. దిగుమతులు 500 మిలియన్ డాలర్లే. ఇవి సైతం మొత్తం దిగుమతుల్లో 0.13%గానే ఉన్నాయి.
- మహేశ్‌గుప్తా, ప్రెసిడెంట్, పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ

ఆర్థిక రంగానికి తగిన సామర్థ్యం..
పాకిస్తాన్‌తో ప్రస్తుత ఉద్రిక్తతల అనంతరం ఎదురయ్యే ఎలాంటి ప్రభావాన్ని అయినా తట్టుకునే శక్తి ఆర్థిక రంగానికి ఉంది. మార్కెట్లు స్పందించిన తీరు అర్థం చేసుకోతగినదే.  - డీఎస్ రావత్, సెక్రటరీ, అసోచామ్

మరిన్ని వార్తలు