ఆర్‌ఎస్ బ్రదర్స్ భారీ విస్తరణ

19 Feb, 2015 01:36 IST|Sakshi
ఆర్ఎస్ బ్రదర్స్ డైరెక్టర్లు,టి.ప్రసాద్ రావు, పి.సత్యనారాయణ,ఎస్.రాజమౌళి,పి.వెంకటేశ్వర్ల(ఎడమ నుంచి కుడికి)

- 2016కల్లా దక్షిణాది రాష్ట్రాలకు
- దుబాయ్, యూఎస్‌లకూ ఔట్‌లెట్లు
- పీఈ ఫండ్ స్వీకరించే ఆలోచన
- ఆర్‌ఎస్ గ్రూప్ ఎండీ వెంకటేశ్వర్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వస్త్రాలు, బంగారు ఆభరణాల రిటైల్ వ్యాపార రంగంలో ఉన్న ఆర్‌ఎస్ బ్రదర్స్ భారీగా విస్తరిస్తోంది. ఈ ఏడాది మరో 3 స్టోర్లను ప్రారంభిస్తోంది.

2016లో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అడుగు పెట్టనుంది. ఆర్‌ఎస్ గ్రూప్ ఇప్పటికే హైదరాబాద్, విజయవాడలో 13 ఔట్‌లెట్లను నిర్వహిస్తోంది. విస్తరణలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి పట్టణాలు సంస్థ పరిశీలనలో ఉన్నాయి. దుబాయ్, యూఎస్, సింగపూర్, మలేషియాల్లోనూ స్టోర్లను ప్రారంభించాలన్న ప్రణాళిక ఉందని గ్రూప్ ఎండీ పి.వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 1999లో ఆర్‌ఎస్ ప్రస్థానం ప్రారంభమైందని, కోట్లాది మందికి చేరువయ్యామని చెప్పారు. వినియోగదార్లకు మరింత దగ్గరయ్యేందుకే విస్తరణ బాట పట్టామన్నారు.
 
టర్నోవర్ రూ. 1,000 కోట్లు..
గ్రూప్ టర్నోవర్ 2013-14లో వస్త్రాల విక్రయాల నుంచి రూ. 480 కోట్లు, బంగారు ఆభరణాల వ్యాపారం ద్వారా రూ. 300 కోట్లుగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం టర్నోవర్ రూ. 900 కోట్లుగా అంచనా వేస్తోంది. 2015-16లో రూ. 1,000 కోట్లను దాటాలన్నదే తమ లక్ష్యమని గ్రూప్ డెరైక్టర్ ఎస్.రాజమౌళి వెల్లడించారు. ఒక్కో స్టోర్‌కు విస్తీర్ణాన్నిబట్టి రూ. 50 కోట్ల దాకా వ్యయం అవుతుందని చెప్పారు. విస్తరణలో భాగంగా అవసరమైతే ప్రైవేట్ ఈక్విటీ ద్వారా రూ.200 కోట్లు సమీకరించే అవకాశమూ ఉందన్నారు. ముంబైకి చెందిన పీఈ సంస్థలు తమతో సంప్రదిస్తున్నాయని వెల్లడించారు. గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న మెన్స్‌వేర్ రిటైల్ ఔట్‌లెట్ ‘స్టేటస్’ బ్రాండ్‌తో రెండేళ్లలో 10 ఔట్‌లెట్లను తెరవాలని సంస్థ నిర్ణయించింది.
 
త్వరలో ఆన్‌లైన్‌లోనూ..
గ్రూప్ బోర్డులోకి రెండవతరం వచ్చి చేరింది. ఆన్‌లైన్‌నూ వేదికగా చేసుకొని సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాలన్నది యువ డెరైక్టర్ల ఆలోచన. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.  సంస్థ స్టోర్లకు నెలకు 6 లక్షల మంది కస్టమర్లు అడుగు పెడుతున్నారు. సీజన్‌లో ఈ సంఖ్య రెండింతలపైమాటే. వీరిలో 60 శాతం మంది పాత కస్టమర్లే కావడం విశేషం. వీరే తమ విజయానికి కారణమని సంస్థ చెబుతోంది. కస్టమర్ సగటున చేసే కొనుగోళ్లు 2010లో రూ.1,700 ఉంటే, ఇప్పుడది రూ.2,500లకు చేరిందని కంపెనీ తెలిపింది. వినియోగదార్ల కొనుగోలు సామర్థ్యం పెరగడమే ఇందుకు కారణమని వివరించింది.

మరిన్ని వార్తలు