పీఎన్‌బీ ట్రేడింగ్‌పై సెబీ దర్యాప్తు

17 Feb, 2018 01:51 IST|Sakshi

ఆడిటర్ల పాత్రపై ఐసీఏఐ దృష్టి

న్యూఢిల్లీ: దాదాపు రూ. 11,400 కోట్ల పైచిలుకు కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) వ్యవహారంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింత లోతుగా విచారణ చేపట్టింది. పీఎన్‌బీతో పాటు గీతాంజలి జెమ్స్‌ సంస్థల షేర్ల ట్రేడింగ్‌ లావాదేవీలు, స్టాక్‌ ఎక్స్చేంజీలకు సదరు సంస్థలు వివరాలు వెల్లడించడంలో చోటుచేసుకున్న వైఫల్యాలు తదితర అంశాలపై దృష్టి సారించింది.  వాస్తవానికి గీతాంజలి జెమ్స్‌ చీఫ్‌ మోహుల్‌ చోక్సీ తదితరులపై గతంలో కూడా ఎన్‌ఎస్‌ఈ చర్యలు తీసుకుంది.

సెక్యూరిటీస్‌ మార్కెట్‌ చట్టాల ఉల్లంఘనలకు గాను మోహుల్‌ చోక్సీ తదితరులు గీతాంజలి షేర్లలో ట్రేడింగ్‌ చేయకుండా 2013 జులైలో ఎన్‌ఎస్‌ఈ నిషేధం విధించింది. బ్రోకరేజి డిఫాల్ట్‌ సహా చోక్సీ పలు కేసులు విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా స్కామ్‌లో కీలకమైన వజ్రాభరణాల డిజైనర్‌ నీరవ్‌ మోదీతో సంబంధమున్న వారితో పాటు సంబంధిత సంస్థల స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలను సెబీ, స్టాక్‌ ఎక్స్చేంజీలు పరిశీలిస్తున్నాయి.  మరోవైపు, పీఎన్‌బీ, గీతాంజలి జెమ్స్‌ వ్యవహారంలో ఆడిటర్ల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ అసోసియేషన్‌ ఐసీఏఐ దృష్టి సారించింది.

ఇందుకు సంబంధించిన సమాచారమేదైనా ఉంటే తమకు తెలియజేయాలంటూ దర్యాప్తు సంస్థలను, సెబీని కోరింది. సుమోటో కింద పీఎన్‌బీ, గీతాంజలి జెమ్స్‌ వ్యవహారంపై సమీక్ష జరపాలంటూ అంతర్గత ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ రివ్యూ బోర్డు (ఎఫ్‌ఆర్‌ఆర్‌బీ)కి సూచించినట్లు ఇటీవలే ఐసీఏఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నవీన్‌ ఎన్‌డీ గుప్తా తెలిపారు. ఇదిలావుండగా, కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన  నీరవ్‌ మోదీ  150 షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది.   

ఎస్‌బీఐ ఇచ్చినది రూ. 1,360 కోట్లు..
పీఎన్‌బీ జారీ చేసిన లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌వోయూ)ల ఆధారంగా నీరవ్‌ మోదీకి ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దాదాపు రూ. 1,360 కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ సుమారు రూ. 1,915 కోట్లు ఇచ్చాయి. పీఎన్‌బీ ద్వారానే తప్ప తాము నేరుగా మోదీకి రుణాలివ్వలేదని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అయితే, మోదీ మేనమామ అయిన మోహుల్‌ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్‌కి మాత్రం ఎస్‌బీఐ సొంతంగా స్వల్ప మొత్తంలో రుణం ఇచ్చినట్లు వివరించారు.

కానీ, తమ మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోలో వజ్రాభరణాల రంగానికి ఇచ్చినది 1 శాతం కన్నా తక్కువే ఉంటుందని ఆయన చెప్పారు. దేశీయంగా ఎస్‌బీఐ సుమారు రూ. 16 లక్షల కోట్ల రుణాలివ్వగా.. ఇందులో వజ్రాభరణాల రంగ రుణాలు రూ.13,000 కోట్ల కన్నా తక్కువేనన్నారు. పీఎన్‌బీ తరహా ఉదంతాలు తలెత్తకుండా జాగ్రత్తపడేలా తమ రిస్క్‌ మేనేజ్‌మెంటు విధానం పటిష్టంగా ఉందని కుమార్‌ పేర్కొన్నారు.

అటు, పీఎన్‌బీ ఎల్‌వోయూల ఆధారంగా ఇచ్చిన రుణ మొత్తం సురక్షితంగానే ఉంటుందని, తాము రాబట్టుకోగలమని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది.   మరోవైపు, పీఎన్‌బీ ఎల్‌వోయూల ఆధారంగా తాము 367 మిలియన్‌ డాలర్ల మేర రుణమిచ్చినట్లుగా అలహాబాద్‌ బ్యాంకు వెల్లడించింది. అయితే, ఈ మొత్తాన్ని రాబట్టుకోగలమని ధీమా వ్యక్తం చేసింది.   

రూ. 500 కోట్ల స్థిరాస్తుల అమ్మకంపై పీఎన్‌బీ దృష్టి
కుంభకోణం నేపథ్యంలో.. పీఎన్‌బీ కొన్ని స్థిరాస్తుల విక్రయ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఉపయోగంలో లేని కొన్ని ఆఫీస్‌ భవంతులు మొదలైన వాటిని సుమారు రూ. 500 కోట్లకు విక్రయించాలని బ్యాంకు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

తగు చర్యలు తీసుకుంటాం: ఆర్‌బీఐ
కుంభకోణం నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లోని (పీఎన్‌బీ) అంతర్గత వ్యవస్థల పనితీరును సమీక్షించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది. కొందరు ఉద్యోగుల తప్పుడు ధోరణులు, అంతర్గతంగా రిస్కు మేనేజ్‌మెంట్‌ వ్యవస్థల వైఫల్యం వల్లే ఈ మోసం చోటు చేసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇప్పటికే.. పీఎన్‌బీలోని కంట్రోల్‌ వ్యవస్థలను సమీక్షించినట్లు, పర్యవేక్షణపరంగా తగు చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది.


కఠిన శిక్షలే తక్షణ కర్తవ్యం..!
పీఎన్‌బీ స్కామ్‌పై కార్పొరేట్లు  
పీఎన్‌బీలో చోటుచేసుకున్న స్కామ్‌పై కార్పొరేట్‌ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థిక మోసాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు,  క్లిష్ట పరిస్థితుల నిర్వహణా యంత్రాంగం వంటి చర్యలు తక్షణం అవసరమని అభిప్రాయపడుతున్నాయి. తద్వారానే భారీ ఆర్థిక కుంభకోణాలను వ్యవస్థ నియంత్రించగలుగుతుందని విశ్లేషించారు. కొన్ని ముఖ్య అభిప్రాయాలను చూస్తే....

బ్యాంకుల బలహీనతను సూచిస్తోంది...
ఒకే ఒక్క బ్రాంచ్‌లో ఇంత మొత్తం మోసపూరిత లావాదేవీలు జరిగాయంటే, భారతీయ బ్యాంకులు ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎంత దుర్బల స్థితిలో ఉన్నాయో అర్థం అవుతోంది. భారత్‌ ఫైనాన్షియల్‌ వ్యవస్థలో నాటుకుపోయిన  లోటుపాట్లకు ఇది అద్దం పడుతోంది. దీనితోపాటు బ్యాంకింగ్‌ వ్యవస్థలో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో తాజా స్కామ్‌ సూచిస్తోంది.

అభివృద్ధి చెందుతున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ స్థాయికి దేశీయ ఫైనాన్షియల్‌ వ్యవస్థలూ ఎదగాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికైనా మన కళ్లు తెరుచుకోవాలి. ఆర్‌బీఐ కూడా జరిగిన అవకతవకలను సకాలంలో గుర్తించలేకపోవడం ప్రత్యేకించి చెప్పుకోతగింది. బ్యాంక్‌ బ్రాంచీలపై ఆర్‌బీఐ పర్యవేక్షణ ఏదో ఒక  సాదాసీదా వ్యవహారంగా తయారైంది. తాజా ఉదంతం బ్యాంకింగ్‌ వ్యవస్థపై డిపాజిటర్ల విశ్వాసాన్ని దెబ్బతీయరాదు.  – డీఎస్‌ రావత్, సెక్రటరీ జనరల్, అసోచామ్‌

బ్యాంకింగ్‌కు ప్రతికూలమే!
ప్రభుత్వ రంగ బ్యాంకులో ఇటీవల చోటుచేసుకున్న చట్టవ్యతిరేక, అనైతిక వ్యాపార విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టప్రకారం మోసగాళ్లకు తీవ్ర శిక్ష పడాలి. బ్యాంకును మోసపుచ్చిన కంపెనీలపై సత్వర, కఠిన చర్యలు తీసుకోవాలి. వ్యాపార సంస్థలకు సంబంధించిన స్వేచ్ఛను మేము కోరుకుంటాం. సమర్థిస్తాం. అయితే అక్రమ, అనైతిక వ్యాపార విధానాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోము.

ఆర్థిక నేరాలకు అసలు మూలం ఎక్కడో తొలుత గుర్తించాలని మేము కోరుకుంటున్నాం. కస్టమర్లకు, షేర్‌ హోల్డర్లకు ఏదైనా బ్యాంక్‌ తన విధులను నిర్వర్తించే క్రమంలో సక్రమమైన విధివిధానాలకు చట్టవ్యతిరేక విధానాల ద్వారా తూట్లు పొడవకూడదు.  ఇందుకు వీలు కల్పించని వ్యవస్థ ఏర్పడాలని కోరుకుంటున్నాం. అసలే మొండిబకాయిల తీవ్ర సమస్యతో సతమతమవుతున్న బ్యాంకులపై తాజా కుంభకోణం తీవ్ర ప్రభావాన్ని చూపించేదే.        – రాషేశ్‌ షా, ఫిక్కీ ప్రెసిడెంట్‌

>
మరిన్ని వార్తలు