మధ్యలో పీపీఎఫ్ ఖాతా ఆపేయవచ్చా..?

2 May, 2016 00:40 IST|Sakshi
మధ్యలో పీపీఎఫ్ ఖాతా ఆపేయవచ్చా..?

నేనొక సంస్థ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది గడవక ముందే వేరే సంస్థ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లోకి మారిస్తే ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా? ఎలాంటి పన్నుపోటు లేకుండా ఉండాలంటే ఎంత కాలం తర్వాత ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయాలి?              
- రామాచారి, విశాఖపట్టణం

 
పన్ను అంశాల పరంగా చూస్తే, ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదిలీ చేయడం అంటే...ఒక మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించి, కొత్తగా మరో మ్యూచువల్ ఫండ్ స్కీమ్ యూనిట్లను కొనుగోలు చేయడంగా పరిగణిస్తారు. ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, దాని నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాదిలోపు మరో మ్యూచువల్ ఫండ్‌లోకి బదిలీ చేస్తే మీరు 15 శాతం చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  

ఏడాది దాటిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎలాంటి దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ఉండదు. పన్ను పోటు లేకుండా ఉండాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్  ఇన్వెస్ట్‌మెంట్స్‌ను  ఏడాది తర్వాత బదిలీ చేయాలి. ఇక లిక్విడ్ ఫండ్స్ విషయానికొస్తే, లిక్విడ్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లలోపు వేరే ఫండ్‌లోకి మళ్లిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ బదిలీపై వచ్చిన లాభాలను మీ ఆదాయానికి కలిపి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మరో మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ బదిలీ విషయంలో ఎగ్జిట్ లోడ్ విషయాన్ని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది.
 
జీవన్ సరళ్ పాలసీ సరెండర్ చేద్దామనుకుంటున్నాను. ఈ పాలసీ సరెండర్‌పై నేనేమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా?
 - రమణ, నెల్లూరు

 
మీరు పాలసీ తీసుకొని ఎన్ని సంవత్సరాలయింది, మీరు తీసుకున్న బీమా కవర్, మీరు చెల్లించిన ప్రీమియమ్ తదితర అంశాలను బట్టి పన్నుల విధింపు ఉంటుంది. కొన్ని సందర్భాల్లోనే జీవన్ సరళ్ బీమా పాలసీ సరెండర్‌పై పన్ను మినహాయింపులు పొందవచ్చు.  2012 మార్చి 31కి ముందు తీసుకున్న పాలసీలైతే, మీరు తీసుకున్న బీమా మొత్తం ,మీరు చెల్లించే వార్షిక ప్రీమియమ్‌నకు ఐదు రెట్ల కంటే అధికంగా ఉన్నప్పుడు.

మీరు 2012 ఏప్రిల్ తర్వాత పాలసీలు తీసుకుంటే, మీరు తీసుకున్న బీమా మొత్తం మీరు చెల్లించే వార్షిక ప్రీమియమ్‌నకు పదిరెట్లు కంటే అధికంగా ఉన్నప్పుడు.  ఈ రెండు సందర్భాల్లో మాత్రం మీకు పన్ను మినహాయింపులు లభిస్తాయి, ఇలా కాని పక్షంలో ఎల్‌ఐసీ జీవన్ సరళ్ లాంటి ఎండోమెంట్ పాలసీలను సరెండర్ చేసినప్పుడు వచ్చిన సరెండర్ విలువను మీ ఆదాయానికి కలిపి, మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
 
నా కొడుకు ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అతని నెల జీతం రూ.11,000. తన వైద్య బీమా ప్రీమియాన్ని నేనే చెల్లిస్తున్నాను. ఈ చెల్లించే ప్రీమియమ్‌పై పన్ను మినహాయింపు పొందవచ్చా?                                            
- క్రాంతి, గుంటూరు

 
18 సంవత్సరాలు దాటిన పిల్లలు, ఉద్యోగస్తులైతే, వారికి చెల్లించే ప్రీమియమ్‌లకు మీరు పన్ను మినహాయింపు పొందలేరు. మీకు, మీ జీవిత భాగస్వామికి, మీపై ఆధారపడిన పిల్లలకు చెల్లించే వైద్య బీమా ప్రీమియమ్‌లకు మాత్రమే ఆదాయపు పన్ను చట్టం  సెక్షన్ 80డి ప్రకారం రూ.25 వేల వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు.
 
నేను 2012, జూలై నుంచి పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్)లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఖాతాలో ఇప్పటిదాకా జమ అయిన మొత్తం రూ. లక్షకు పైగా ఉంది.  దీని కంటే పన్ను ఆదా చేసే స్కీమ్‌లు ఉండటంతో ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేయడం ఆపేద్దామనుకుంటున్నాను. ఈ ఖాతాను ఆపేయడం ఎలా? ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నేను ఎప్పుడు తీసుకోవచ్చు?                                        - జ్యోతి, కాకినాడ
 
పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్(పీపీఎఫ్) ఖాతాను మధ్యలో ఆపేయడానికి లేదు. ఈ ఖాతాను ప్రారంభించి పదిహేను ఆర్థిక సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే ఈ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 ఈ ఖాతాలో ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ఇన్వెస్ట్ చేయని పక్షంలో ప్రతీ ఏడాది రూ.50 చొప్పున ఈ ఖాతా మెచ్యుర్ అయ్యేంత వరకూ  జరిమానా విధిస్తారు. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించి ఆరేళ్లు దాటితే పాక్షికంగా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
- ధీరేంద్ర కుమార్, సీఈవో,వ్యాల్యూ రీసెర్చ్

మరిన్ని వార్తలు