కి‘లేడీ’లు

16 Mar, 2018 10:22 IST|Sakshi
చోరీ చేసేందుకు మహిళను అనుసరిస్తున్న ఇద్దరు మహిళలు సీసీ కెమెరాలో నమోదయిన దృశ్యం, నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ రెడ్డెప్ప

మహిళలను ఏమార్చి చోరీలు

ఇద్దరు మహిళలు అరెస్ట్‌

5 తులాల బంగారు నగలు స్వాధీనం

బద్వేలు అర్బన్‌: మహిళలను ఏమార్చి చాకచక్యంగా చోరీలకు పాల్పడే ఇద్దరు మహిళలను గురువారం బద్వేలు పోలీసులు అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి 1.50 లక్షలు విలువ చేసే 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.ఇందుకు సంబంధించి స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్వేలు సీఐ రెడ్డప్ప నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 న అట్లూరు మండలం ఎస్‌.వెంకటాపురం గ్రామానికి చెందిన అయ్యవారమ్మ పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం తన బ్యాగులోని పర్సును తీసి డబ్బులు చెల్లించే క్రమంలో...అందులో నగలు ఉన్నట్లు గుర్తించిన కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం సిద్దాపురం గ్రామానికి చెందిన గోగోల దానమ్మ, ఆత్మకూరు టౌన్‌ మేదర వీధికి చెందిన ఇరగాదిన్ల సరోజమ్మ లు అయ్యవారమ్మను అనుసరించారు. బస్టాండ్‌ సమీపంలోని పూల అంగళ్ల వద్ద పూలు కొనుగోలు చేసే సమయంలో ఆ ఇద్దరు  మహిళలు తమ పైటను కట్టెల బ్యాగు పై వేసి ఎవరికీ అనుమానం రాకుండా అందులోని నగలతో ఉడాయించారు. ఇంతలో పూలకు డబ్బులు ఇచ్చేందుకు పర్సు చూసుకోగా పర్సు కనిపించక పోవడంతో వెంటనే అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నిందితులను పట్టించిన సీసీ కెమెరా
మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పరిశీలించగా అందులో ఇద్దరు మహిళలు చోరీకి పాల్పడుతున్నట్లు గుర్తించి సిద్దవటం రోడ్డులోని మరికొన్ని సీసీ కెమెరాల ద్వారా వారి కదలికలను పరిశీలించారు. వారు పోరుమామిళ్ల వైపు వెళ్ళినట్లు నిర్ధారించుకుని అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు.ఈ సమయంలో పోరుమామిళ్లలోని కొమరోలు–మైదుకూరు ప్రధాన రహదారి పై ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన అర్బన్‌ ఎస్‌ఐ చలపతిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రూరల్‌ ఎస్‌ఐ హేమాద్రి, హెడ్‌ కానిస్టేబుల్‌ సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు