నా కొడుకును చంపేసినా బాధపడం: చిట్టెమ్మ

27 Jul, 2019 20:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ: హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన ఫార్మసీ విద్యార్థి సోనీ ఆచూకీ ఇంకా తెలియలేదు. మిస్టరీగా మారిన కిడ్నాప్‌ కేసులో తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. మరోవైపు నిందితుడు రవిశంకర్‌పై అతడి కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకును చంపేసినా బాధపడమని తల్లి చిట్టెమ్మ తెలిపింది. ‘ఓ అమ్మాయిని కిడ్నాప్‌ చేయడం తప్పు. తప్పు ఎవరు చేసినా అది తప్పే. నా కొడుకును కఠినంగా శిక్షించండి. అటువంటి నీచుడిని కన్నందుకు బాధగా ఉంది. అతడిని చంపేసినా బాధపడను. వాడెప్పుడో చనిపోయాడు. గతంలో నా కొడుకును మారమని చాలాసార్లు చెప్పాను. కాళ్లు పట్టుకుని బతిమిలాడాను. అయినా పద్ధతి మార్చుకోలేదు. నా కొడుకు తీరుతో మా కుటుంబం తీవ్ర అవమానాలు పడుతున్నాం. ఈ కేసులో అమాయకుడైన నా మనవడు రాజును (రవిశంకర్‌ కొడుకు) పోలీసులు తీసుకెళ్లారు. నా మనవడు నాకు కావాలి. వాడంటే నాకు ప్రాణం.’  అని ఆవేదన వ్య‍క్తం చేసింది.

రవిశంకర్‌ సోదరుడు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ‘నా తమ్ముడు చాలా దుర్మార్గుడు. వాడిని చంపేసినా మేం బాధపడం. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నా మేము పట్టించుకోం. ఒకవేళ అతడిని చంపేసినా శవాన్ని తీసుకు వెళ్లడానికి కూడా మేం రాము. అలాంటోడిని బతకనిస్తే సమాజానికే ప్రమాదం. ఏం పాపం తెలియని అతడిని కొడుకుని వేధింపులకు గురి చేయడం సరికాదు’  అని అన్నాడు. 

చదవండియువతి కిడ్నాప్‌; సీసీటీవీ ఫుటేజ్‌ లభ్యం..!

ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరుకు చెందిన రవిశంకర్‌ జల్సాలకు అలవాటుపడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. అటెన్షన్‌ డైవర్ట్ చేసి పనికాచ్చేయటంలో దిట్టగా పేరొందాడు. కంకిపాడు, పెనమలూరు, విజయవాడల్లో దొంగతనాలకు పాల్పడి చాలాసార్లు పట్టుబడి, జైలు జీవితం సైతం అనుభవించాడు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ వృత్తిలోకి దిగేవాడు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు పలు చోట్ల చోరీలకు పాల్పడ్డాడు. ఒక్క ఏపీలోనే 25 నేరాలు చేసినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఓ కేసులో అరెస్టయిన రవిశంకర్ ఎస్కార్ట్ కళ్లుగప్పి పారిపోయాడు. అప్పటి నుంచి ఏపీ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. 

చదవండిఎవరు?..ఎందుకు?

ఉన్నట్టుండి హైదరాబాద్ లో ప్రత్యక్షం కావటం స్టూడెంట్ సోనీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లటంతో మరోసారి తెరపైకి వచ్చాడు. ఇక ఏపీ పోలీసుల సహకారం తీసుకుని రవిశంకర్ ఆచూకీ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. అయితే ఇప్పటివరకు కేవలం దొంగతనాలు మాత్రమే చేసిన రవిశంకర్ ఇప్పుడు కిడ్నాపర్‌గా ఎందుకు మారాడు.?పోలీసుల నుంచి తప్పించుకున్న తర్వాత ఏదైనా గ్యాంగ్‌తో చేతులు కలిపాడా? కిడ్నీ రాకెట్‌తో ఏమైనా సంబంధాలున్నాయా? దుబాయికి అమ్మాయిలని అమ్మే ముఠాలో సభ్యుడయ్యాడా..? ఇందుకోసమే తండ్రిని ట్రాప్‌ చేసి కూతురు సోనిని కిడ్నాప్‌ చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 

>
మరిన్ని వార్తలు