ఆస్తి కోసం మామను మట్టుబెట్టిన అల్లుడి

24 Nov, 2018 10:49 IST|Sakshi
మాట్లాడుతున్న చౌటుప్పల్‌ ఏసీపీ బాపూరెడ్డి, నిందితుడు శంకర్‌నాయక్‌

భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : ఆస్తికోసం మామను మట్టుబెట్టిన అల్లుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చౌటుప్పల్‌ ఏసీపీ బాపూరెడ్డి, సీఐ పార్థసారథి, ఎస్‌ఐ మధుసూదన్‌ కేసు వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని చెట్లకుంట్ల తండాకు చెందిన మేరావత్‌ లాలూనాయక్‌(60), సోని దంపతులకు నలుగురు కుమార్తెలు. ఈయన పేర 3 ఎకరాల వ్యవసాయభూమి ఉంది. కాగా లాలూనాయక్‌ చిన్న కుమార్తె మమతకు దేవరకొండ మండలం పడమటిపల్లి గ్రామపరిధిలోని పత్లావత్‌ తండాకు చెందిన వడ్త్య శంకర్‌నాయక్‌తో ఏడాది క్రితం వివాహం చేశారు. కుమారులు లేకపోవడంతో శంకర్‌నాయక్‌ ఇల్లరికం తెచ్చుకున్నాడు.

లారీడ్రైవర్‌గా పనిచేసే శంకర్‌నాయక్‌ ప్రతిరోజు మద్యం తాగివచ్చి ఆస్తినంతా తనపేరిట రాయాలని భా ర్య, అత్తామామలను వేధింపులకు గురిచేస్తున్నా డు. అల్లుని వేధింపులు తట్టుకోలేక లాలూనాయక్‌ బతుకుదెరువు కోసం భార్య సోనితో కలిసి ఐదు నెలల క్రితం మండలంలోని జూలూరు గ్రామానికి వచ్చి, స్థానిక అంబికా గార్డెన్స్‌ ఫంక్షన్‌హాలులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20న, రాత్రి శంకర్‌నాయక్‌ తన భార్యకు ఫోన్‌ చేసి మీ నాన్నను చంపేస్తానని చెప్పాడు. అదే రోజు రాత్రి బైక్‌పై జూలూరుకు చేరుకొన్న అతను ఫంక్షన్‌హాలులో పడుకున్న మామ లాలూనాయక్‌పై గ్రైండర్‌రాయిని తలపై మోది హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఫంక్షన్‌హాలులో ఏర్పాటుచేసిన సీసీ పుటేజీని పరిశీలించగా శంకర్‌నాయక్‌ హత్య చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పత్లావత్‌ తండాలో తలదాచుకున్నాడని తెలుసుకొన్న పోలీసులు అతనిని పట్టుకొని అరెస్ట్‌ చేసి శుక్రవారం భువనగిరి కోర్టుకు రిమాండ్‌కు తరలించారు. ఆస్తికోసమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. కేసు త్వరితగతిన ఛేదించిన హెడ్‌కానిస్టేబుల్‌ నర్సింహ, సత్యం, హోమ్‌గార్డ్‌ సుధాకర్‌ను రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ అభినందించారని చెప్పారు.

మరిన్ని వార్తలు