గుత్తిలో ఏడు ఇళ్లలో చోరీ 

23 Sep, 2019 11:11 IST|Sakshi
ప్రసాద్‌ ఇంటిని పరిశీలిస్తున్న  ఎస్‌ఐలు గోపాలుడు, ఇబ్రహీంలు    

సాక్షి, అనంతపురం(గుత్తి) : గుత్తిలో దొంగలు హల్‌చల్‌ చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఏడు ఇళ్లల్లో చోరీలకు తెగబడ్డారు. రూ. 11.50 లక్షల నగదుతో పాటు ఐదు తులాల బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, దుస్తులు అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు... గుత్తిలోని బండగేరిలో నివాసముంటున్న రిటైర్డ్‌ విద్యుత్‌ లైన్‌మన్‌ ప్రసాద్‌ ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు బీరువాలోని రూ.11 లక్షల నగదును ఎత్తుకుపోయారు. అనంతరం ఇదే వీధిలోని సుబ్బరాయుడు, పుల్లయ్య ఇళ్లల్లోకీ చొరబడి కొంత నగదు, విలువైన వస్తువులు, దుస్తులు ఎత్తుకెళ్లారు. కమాటం వీధిలో చీరెల వ్యాపారి గాయత్రి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువాలోని రూ.50వేల నగదుతో పాటు మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. సమీపంలోని ఇర్ఫాన్‌ ఇంటిలోనూ విలువైన వస్తువులు, దుస్తులు ఎత్తుకెళ్లారు.  

అలాగే గుత్తి ఆర్‌ఎస్‌లోని కర్నూల్‌ రోడ్డులో నివాసముంటున్న రిటైర్డ్‌ రైల్వే పాయింట్స్‌మన్‌ నారాయణస్వామి ఇంటిలో దొంగలు పడి బీరువాలోని రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు విలువైన చీరలు ఎత్తుకెళ్లారు. ఇదే కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటిలో దొంగలు పడి విలువైన దుస్తులు, వస్తువులు చోరీ చేశారు. చోరీలు జరిగిన ఇళ్లను సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజేష్‌లతో పాటు అనంతపురం క్లూస్‌ టీం సభ్యులు, వేలి ముద్ర నిపుణులు , డాగ్‌ స్క్వాడ్‌ ఆదివారం పరిశీలించారు.  

మరిన్ని వార్తలు