దళితులపై దాడుల నిరోధానికి పోరాటాలు

7 Aug, 2017 00:01 IST|Sakshi
దళితులపై దాడుల నిరోధానికి పోరాటాలు
ఎస్సీ వర్గీరకణను సమర్థిస్తే ఏ పార్టీనైనా భూస్థాపితం చేస్తాం 
మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు భీమారావు
అమలాపురం టౌన్‌ : నవ్యాంధ్ర ప్రదేశ్‌లో అత్యధికంగా మాలలు ఉన్నారని... ఎస్సీ వర్గీకరణ జోలికి వచ్చి ఆ అంశాన్ని మళ్లీ తెర మీదకు తీసుకురావాలని ప్రయత్నించే ఏ రాజకీయ పార్టీనైనా భూ స్థాపితం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు హెచ్చరించారు. ఇప్పుడే కాదు భవిష్యత్‌లో కూడా వర్గీకరణను సమర్థిస్తూ భూజాన వేసుకునే పార్టీలకు తగిన గుణ పాఠం చెప్పేందుకు మాల మహానాడు సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. అమలాపురంలోని మదర్‌ థెరిస్సా పాఠశాలలో కోనసీమ దళిత నేతలు, వివిధ సామాజిక వర్గాల నాయకుల ఆధ్వర్యంలో మాల మహానాడుకు జాతీయ అధ్యక్షుడు అయిన సందర్భంగా భీమారావుకు ఆదివారం అభినందన సభ జరిగింది. సభకు భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు పుట్టిన మాల మహానాడు ఉద్యమాల, దాని ఫలితాల వల్లే నేడు ఆ అంశం మరుగున పడిందని భీమారావు గుర్తు చేశారు. ఇటీవల కాలంలో దళితులపై జరుగుతున్న దాడుల నిరోధానికి మాల మాహనాడు జాతీయ స్థాయిలో పోరాటాలు చేసేందుకు నడుం బిగిస్తోందని వెల్లడించారు. పెరుగుతున్న ఎస్సీ జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం అమలువుతున్న 15 శాతం రిజర్వేషన్లను 23 శాతానికి పెంచాలన్న డిమాండును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లనున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలను క్రమేపీ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ పద్దతుల్లో భర్తీ చేస్తుండడం వల్ల రిజర్వేషన్ల ఉనికి తగ్గిపోతున్న క్రమంలో ప్రైవేట్‌ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌తో మాల మహానాడు ఉద్యమాలకు ప్రణాళికి సిద్ధం చేస్తోందని స్పష్టం చేశారు. అనంతరం సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ 21 ఏళ్ల మాల మహానాడు ఉద్యమ ప్రస్థానం ఆదిలో భీమారావు ఉద్యమకారుడిగా లాఠీ దెబ్బలు, జైలు శిక్షలు అనుభవించారని... అలాంటి రాజీ లేని ఉద్యమ వాదికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు అప్పగించడం అభినందనీయమన్నారు. కోనసీమ దళిత ఐక్య వేదిక చైర్మన్‌ డీబీ లోక్, ఆ వేదిక ముఖ్య ప్రతినిధులు ఇసుకపట్ల రఘుబాబు, జంగా బాబూరావు, ఉండ్రు బుల్లియ్య, సాపే బాలరవి, కాట్రు చంద్రమోహన్, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పినిపే రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షుడు వెంటపల్లి జాన్‌మార్క్, రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీఎస్‌ దివాకర్, జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యిళ్ల సత్యనారాయణ, కోనసీమ కాపు మిత్ర ప్రతినిధి బండారు రామమోహనరావు, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ బ్రాహ్మణ సమాఖ్య కో ఆర్డినేటర్‌ మంగళంపల్లి అంజిబాబు తదితరులు సభలో ప్రసంగించారు. అనంతరం భీమారావును సత్కరించారు.
మరిన్ని వార్తలు