ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి

3 Aug, 2017 21:52 IST|Sakshi

అనంతపురం అర్బన్‌: ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని, ఇందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న చెక్‌పోస్టుల ద్వారా నిఘాను మరింత పటిష్టం చేయాలన్నారు. కలెక్టర్‌ గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇసుక పాలసీపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎన్ని రీచ్‌ల ద్వారా ఇసుక లభ్యత ఉందో ముందుగా గుర్తించాలని గనులు, భూగర్భ వనరులశాఖ ఏడీ వెంకటరావుని ఆదేశించారు. ప్రస్తుతం 55 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్‌ ఇసుకకు రూ.2 వేలు, టిప్పర్‌కు రూ.4 వేల వరకు అన్ని చార్జీలతో కలిసి వసూలు చేస్తున్నారన్నారు.

అంతకు పైబడి కిలోమీటర్‌ దూరానికి ట్రాక్టర్‌కి రూ.36, టిప్పర్‌కి రూ.73 చొప్పున అదనంగా రుసుం వసూలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇసుక ధరల మానిటరింగ్‌కు ఏర్పాటు చేసి టాస్క్‌ఫోర్స్‌ మండల కమిటీలో తహశీల్దారు, ఎంపీడీఓ, పోలీసు అధికారి, ఇరిగేషన్‌ అధికారులు, డివిజన్‌ కమిటీలో ఆర్‌డీఓ, డీఎస్‌పీ, సంబంధిత శాఖలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లా ధరల నియంత్రణ, నోటిఫికేషన్‌ జారీకి సంబంధించి జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్‌పీ, డీటీసీ, నీటిపారుదల శాఖ ఎస్‌ఈలు సభ్యులుగా ఉంటారన్నారు. గనులు భూగర్భవనరులశాఖ ఏడీ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నారు. వీరితో పాటు అదనంగా పంచాయతీరాజ్, హెచ్‌ఎల్‌జీ, హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్‌ ఎస్‌ఈలు, డీడీ గ్రౌండ్‌ వాటర్‌ శాఖల అధికారులు కూడా సభ్యులుగా చేర్చాలని ఏడీని ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సభ్యులే ఇసుక అక్రమ రవాణాను అరికట్టే బాధ్యతలను నిర్వర్తిస్తారని అన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు