ఆ మలుపులు..మృత్యు పిలుపులు

24 Aug, 2016 23:18 IST|Sakshi
ఆ మలుపులు..మృత్యు పిలుపులు
  • సూర్యాపేట – కోదాడ క్రాస్‌రోడ్‌ 50 కిలోమీటర్లు డేంజర్‌
  • రహదారి నిండా పది వంకలు.. పలు ప్రమాదాలు
  • రోడ్డు పక్కనే చెరువులు.. బావులు, గోతులు
  • గతంలో ప్రమాదానికి గురైన సినీ నటులు జూ.ఎన్టీఆర్, ప్రణీత
  • నాయకన్‌గూడెం వద్ద జూన్‌ 24న ఎన్‌ఎస్‌పీ కాల్వలో పడ్డ
  • మణుగూరు డిపో బస్సు
  • తాజాగా అదే కాలువలో యాత్రాజినీ టూరిస్టు బస్సు
  • సాక్షి ప్రతినిధి, ఖమ్మం:
    సూర్యాపేట నుంచి పాలేరు, కోదాడ క్రాస్‌రోడ్డు వరకు... 50 కిలోమీటర్లు.. ఈ రహదారంతా ప్రస్తుతం డేంజర్‌.. యమ డేంజర్‌గా మారింది. సూర్యపేట నుంచి ఖమ్మం రావాలంటే వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. తాజాగా పలు సంఘటనలు జరగడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనతోనే ప్రయాణం చేస్తున్నారు. ద్విచక్రవాహనం నుంచి మొదలుకొని ఏ వాహనమైనా... అందులో ప్రయాణించేవారు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా సాగర్‌ కాల్వ వద్ద జరిగిన ఘటనతో ఖమ్మం జిల్లావాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
    50 కిలోమీటర్ల ఈ రహదారిలో పది మూలమలుపులు అత్యంత డేంజరస్‌గా ఉన్నాయి. అంతేకాక మూలమలుపుల్లో చెరువులు, కుంటలు, బావులు, వంతెనలు ఉండటంతో ఏదో ఒకచోట నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జాతీయ రహదారి భద్రతా సదస్సులో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కారీ తెలంగాణలో పలు బ్లాక్‌స్పాట్‌లను గుర్తించామని, వీటి మరమ్మతులు చేయిస్తామని ప్రకటన చేశారు. అయితే ఈ రహదారుల్లోని డేంజరస్‌ స్థలాలు కూడా ఉన్నాయి. సూర్యాపేట దాటగానే చివ్వెంల వద్ద.. ఆ చెరువు దాటడానికి రెండుమూడు మలుపులు తిరగాల్సి ఉంటుంది.. అది దాటి వచ్చాక మోతె మండల కేంద్రం సమీపంలో నీటి కుంటలు, వ్యవసాయ బావులు ఉన్నాయి. ఆ తరువాత నాయకన్‌గూడెంలో సాగర్‌కాలువ బ్రిడ్జి ఇరుకుగా ఉండటం, పాలేరు బ్రిడ్జి, కంకరమిల్లు వద్ద, కూసుమంచి, కేశవాపురం, జీళ్లచెరువు, తళ్లంపాడు, మద్దులపల్లి, కోదాడ క్రాస్‌రోడ్‌వరకు పలు వంకర్లు ఉన్నాయి. గత ఏడాది హీరోయిన్‌ ప్రణీత ఖమ్మంలోని ఓ వస్త్రదుకాణం ప్రారంభోత్సవానికి వచ్చి, తిరిగి హైదరాబాద్‌ వెళ్తుండగా మోతె వద్ద ప్రమాదానికి గురైంది. 2009లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం వచ్చి టీడీపీ తరపున ప్రచారం చేసిన సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ తిరిగి హైదరాబాద్‌ వెళ్తుండగా మోతె మండల శివారులో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తున్న సఫారీ వాహనం రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడటంతో ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. జూన్‌ 24వ తేదీన నాయకన్‌గూడెం సాగర్‌కాలువలో మణుగూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు పడటంతో ఒక చిన్నారి మృతిచెందింది. తాజాగా సోమవారం అదే బ్రిడ్జిపై రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒక ఘటనలో రెండు బస్సులు ఢీకొనగా ప్రయాణికులకు గాయాలు కాలేదు. కానీ మరో ఘటనలో యాత్రాజినీ బస్సు కాల్వలో పడటంతో 10 మంది మృత్యువాతపడగా 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
    అతివేగం.. అదుపు తప్పి...
    మూల మలుపుల వద్ద జరుగుతున్న అత్యధిక ప్రమాదాల్లో అతివేగమే కారణంగా కన్పిస్తోంది. భారీ వాహనాలను అనుభవం లేని డ్రైవర్లు నడుపుతుండటం మరో కారణంగా చెబుతున్నారు. వాహనాలను అతివేగంగా తీసుకురావడం, మూల మలుపుల వద్ద వాటిని అదుపుచేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ప్రయాణికులు విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోంది. అతివేగాన్ని నియంత్రించేందుకు మూలమలుపుల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడంతో డ్రైవర్లు ఇష్టారీతిలో నడుపుతున్నారు. అంతేకాక కనీసం హెచ్చరిక బోర్డులు సైతం సక్రమంగా లేని పరిస్థితి నెలకొంది. దీంతో కొత్తగా ఆయా దారుల్లో వచ్చేవారికి ఎక్కడ మూల మలుపు ఉందో తెలియక అతివేగంలో వాహనాన్ని అదుపుచేయలేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా జరిగిన సంఘటనతోనైనా ప్రభుత్వం కళ్లుతెరవాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు