నెలాఖరు వరకు ఇన్‌పుట్‌ అర్జీలు

22 Jul, 2017 21:43 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌: ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించిన సమస్యలపై రైతుల నుంచి ఈనెలాఖరు వరకు అర్జీలు స్వీకరిస్తామని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన 77 వేల అర్జీలను సమస్యల వారీగా విభజించి పరిష్కరించే పనిలో ఉన్నామన్నారు. చాలా మంది రైతులు ఒకే సమస్యపై రెండు మూడు అర్జీలు ఇవ్వడం వల్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోందన్నారు. జాబితాలో లేనివి, భూమి ఉన్నా మరీ తక్కువగా పరిహారం జమ అయినవి, వివరాల నమోదులో జరిగిన తప్పిదాలు తదితర సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి అందరికీ న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదంతా వారం, పది రోజుల్లోపు పరిష్కారమయ్యే పరిస్థితి లేనందున రైతులు సంయమనం పాటించాలని సూచించారు. సాంకేతిక కారణాలతో ఓడీసీ మండలంలో జాబితాల్లో పొరపాటు జరిగిందన్నారు. కదిరి, కళ్యాణదుర్గం డివిజన్లు, ఆత్మకూరు, మరో పది మండలాల్లో సమస్యలు కాస్త ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. రైతులిచ్చిన అర్జీలన్నీ అన్నింటినీ పరిశీలిస్తామన్నారు. జాబితాల తయారీలో అధికారులు ఉద్దేశపూర్వకంగా పొరపాట్లు చేసినట్లు తెలిస్తే శాఖా పరమైన చర్యలకు వెనుకాడేదిలేదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు