అప్పుడు అదృశ్యం...ఇప్పుడు ప్రత్యక్షం

19 Apr, 2017 22:55 IST|Sakshi
అప్పుడు అదృశ్యం...ఇప్పుడు ప్రత్యక్షం
20 ఏళ్ల క్రిందట అదృశ్యమైన తమ్ముడు
ఆకస్మికంగా ప్యత్యక్షం ... ఆ కుటుంబాల్లో ఆనందం
 
ఇరవై ఏళ్ల కిందట ... పదిహేనేళ్ల వయసులో ఇంట్లో అలిగి పారిపోయాడు. కడుపు మాడితే వాడే వస్తాడులే అనుకున్నారు. ఒకటి, రెండు రోజులు ఎదురు చూశారు. అప్పటికీ రాకపోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఒక్కటై వెదికారు. ఫలితం కనిపించలేదు. ఆశలు వదులుకున్నారు. ఈ ఘటన 1997 మే నెలలో జరిగింది. 20017 ఏప్రిల్‌ నెల ... సరిగ్గా 20 ఏళ్ల తర్వాత నాడు అదృశ్యమైన కుర్రాడు ఓ కేసు విచారణలో ఊరు పేరు బయటపడడంతో అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి తన కుటుంబ సభ్యులను పిలిపించడంతో ఉద్విగ్న పరిస్థితులు నెలకున్నాయి.  - అమలాపురం టౌన్‌
20 ఏళ్ల క్రితం ఏం జరిగింది?
అమలాపురం రూరల్‌ మండలం సాకుర్రు గ్రామానికి చెందిన శిరగం బాలకృష్ణ అన్నదమ్ములు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవించే వారు. ఆ అన్నదమ్ముల్లో చివరి వాడైన శిరగం రాంబాబు (15) తన అన్నల వ్యాపారంలో తన వంతు సాయపడేవాడు. వీరి తల్లిదండ్రులు చిన్నతనంలో మరణించారు. దీంతో రాంబాబు తన ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు దగ్గరే పెరిగాడు. ఓ రోజు ఇంట్లో కోపగించి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. కొన్నాళ్లు రాంబాబు కోసం బంధువులు, స్నేహితులు ఇళ్ల వద్ద గాలించినా ప్రయోజనం లేదు. ఈ లోపు అక్కలకు పెళ్లిళ్లు కావడం, అన్నయ్యలు పండ్ల వ్యాపారాలతో వేరే గ్రామాల్లో స్థిరపడ్డారు.  
ఎక్కడెక్కడ పనిచేశాడు..
రాంబాబు ఇంట్లోంచి 15వ ఏట వెళ్లిపోయి హైదరాబాద్‌ చేరుకున్నాడు. అక్కడే ఇరవై ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఓ షామియానా షాపులో కూలీగా పదేళ్లు పనిచేశాడు. బోయినపల్లిలో ఓ పంక‌్షన్‌ హాలులో మరో పదేళ్లు కూలీగా పనిచేశాడు. అయితే మూడు నెలల క్రితం అమలాపురం వచ్చి పట్టణంలోని ఓ పాత ఇనుము, ప్లాస్టిక్‌ సామాన్ల దుకాణంలో పనిచేస్తున్నాడు.
పోలీసు స్టేషన్‌కు వచ్చిందిలా..
పట్టణంలో మంగళవారం సాయంత్రం రోడ్డుపై రాంబాబు, మరో వ్యక్తి ఓ విషయమై గొడవ పడ్డారు. అవతలి వ్యక్తి ఫిర్యాదుతో రాంబాబును స్టేషన్‌ క్రైం పార్టీ హెడ్‌ కానిస్టేబుళ్లు అయితాబత్తుల బాలకృష్ణ, బత్తుల రామచంద్రరావు స్టేషన్‌కు తీసుకుని వచ్చి  విచారించారు. అసలు నీది ఏ ఊరు?, నీ వాళ్లు ఎవరు? అని ఆరా తీశారు. రాంబాబు మాది సాకుర్రు గ్రామమని, గతంలో ఇళ్లు విడిచి వెళ్లిపోయానని... ఇప్పుడు మా వాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని బదులిచ్చాడు. దీంతో పోలీసులు సాకుర్రులోని రాంబాబు బంధువులను రప్పించి సమాచారం చెప్పారు. అంబాజీపేటలో ఉంటున్న రాంబాబు అన్నయ్య బాలకృష్ణకు, సాకుర్రులో ఉంటున్న అక్క నల్లా ఆదిలక్ష్మి కుటుంబాలకు బంధువులు సమాచారం అందించి బుధవారం మధ్యాహ్నం పోలీసు స్టేషన్‌కు రప్పించారు. 20 ఏళ్ల తర్వాత రాంబాబును చూసి అన్నయ్య, అక్క కుటుంబాల వారు ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు వారి ఆనందానికి అవుధుల్లేవు. మొత్తానికి కథ కంచికి.. రాంబాబు ఇంటికి చేరాడు.

 

మరిన్ని వార్తలు