ప్రాణాలు పోతున్నా..కనికరం లేదా?

19 Dec, 2016 23:46 IST|Sakshi
ప్రాణాలు పోతున్నా..కనికరం లేదా?
- పింఛన్‌ కోసం వృద్ధుల ఆందోళన
డోన్‌ టౌన్‌ : ‘బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తూ.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అధికారులకు తమ పట్ల కనికరం లేదా’ అంటూ వృద్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం డోన్‌ పట్టణంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పింఛన్‌ కోసం స్థానిక ఎస్‌బీఐ వద్దకు..వందల మంది వృద్ధులు వచ్చారు. డబ్బులు లేవని బ్యాంకు మేనేజర్‌ యశోదర కృష్ణారావు చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడ్డామని.. డబ్బులేదనడం ఏం న్యాయమని నిప్పులు చెరిగారు. బ్యాంకు ఎదుట ప్రధాన రహదారిపై  బైఠాయించి నిరసన తెలిపారు. ఎస్‌ఐ శ్రీనివాసులు సర్దిచెప్పినప్పటికీ వినుకోలేదు. రెండు రోజుల క్రితం సుంకులమ్మ అనే వృద్ధురాలు ఆంధ్రాబ్యాంక్‌కు పింఛన్‌కోసం వచ్చి గుండెపోటుతో మృతి చెందిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. పింఛన్‌లు ఇచ్చేలోపు ఇంకా ఎంతమంది చావాలి అంటూ నిలదీశారు. బ్యాంక్‌ ఖాతాలకు ఆధార్‌ నంబర్‌ లింక్‌ కాకపోవడం, ఇతరత్రా సాంకేతిక కారణాలతో పింఛన్‌ అందజేయడంలో ఆలస్యం జరుగుతోందని మేనేజర్‌ యశోదర కృష్ణారావు చెప్పారు. మంగళవారం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి..అందరికీ పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో వృద్ధులు ఆందోళన విరమించారు.
 
>
మరిన్ని వార్తలు