పెద్దాస్పత్రిలో ఒక్కటే అంబులెన్స్‌

7 Oct, 2016 21:11 IST|Sakshi
పెద్దాస్పత్రిలో ఒక్కటే అంబులెన్స్‌

 

  • నాలుగు అవసరం..
  • ఒకటి గజ్వేల్‌ ఆస్పత్రికి కేటాయింపు
  • మరమ్మతులు లేక మూలనపడిన మరో వాహనం..
  • అంబులెన్సుల కొరతతో రోగులకు అవస్థలు
  • అత్యవసర సమయంలో ఆస్పత్రికి చేరేందుకు పాట్లు


మెదక్‌ మున్సిపాలిటీ: మెదక్‌ డివిజన్‌లోనే అతి పెద్దదైన మెదక్‌ ఏరియా ఆస్పత్రిలో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌ సౌకర్యం కరువవుతోంది. దీంతో ప్రమాదంలో గాయపడినవారు, ఆపదలో ఉన్నవారు సరైన సమయంలో వైద్యం అందక పడరాని పాట్లు పడుతున్నారు. మెదక్‌ పట్టణంలోని డివిజన్‌లోనే అతి పెద్దది కాగా గతంలోనే వంద పడకల ఆస్పత్రిగా విస్తరించారు. ఈ ఆస్పత్రికి మెదక్‌ పట్టణం, మండలంతోపాటు పాపన్నపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, కొల్చారం, కౌడిపల్లి, చేగుంట, రామాయంపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట మండలాలతోపాటు నిజామాబాద్‌ జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన రోగులు ఆస్పత్రికి వస్తుంటారు.  ఆయా మండలాల నుండి తరలివచ్చే రోగులతో  ఆస్పత్రి నిత్యం కిటకిటలాడుతుంది.

ఈ ఆస్పత్రిలో వైద్యులు అందిస్తున్న సేవలకు గుర్తింగా ఇటీవలే ప్రభుత్వం ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు అందజేసింది. కానీ ఈ వంద పడకల ఆస్పత్రిలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అటు అధికారులుగానీ, ఇటు ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఇంత పెద్ద ఆస్పత్రిలో కేవలం ఒకే ఒక్క అంబులెన్స్‌ ఉండడం గమనార్హం. ఆస్పత్రిలో అంబులెన్స్‌ కొరత వల్ల రోగులు అత్యవసర సమయంలో హైదరాబాద్‌కు తరలివెళ్లలేక ప్రాణాలు కోల్పోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేసున్నారు. కాగా ఆస్పత్రికి ఒకే ఒక అంబులెన్స్‌ ఉండడంతో అత్యవసర ‡సమయంలో బాధితులను హైదరాబాద్‌కు తరలిస్తే మరోచోట ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోతున్నారని రోగులు వాపోతున్నారు.  మెదక్‌ ఆస్పత్రికి నాలుగు అంబులెన్స్‌లు అవసరముంటే ఒక్కటి మాత్రమే ఉన్నట్లు సమాచారం. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాజీ ఎంపీ నరేంద్ర హయాంలో ఒక అంబులెన్స్‌ను అందించారు.

కొన్ని రోజులు ఆ అంబులెన్స్‌ రోగులకు ఎంతగానో ఉపయోగపడింది. అయితే అంబులెన్స్‌ చెడిపోవడంతో తిరిగి దానికి మరమ్మతు చేయించకుండా మూలన పడేశారు.  అనంతరం మాజీ ఎంపీ విజయశాంతి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌ మంజూరు చేశారు. నిత్యం వందలాది సంఖ్యలో వివిధ రోగాలతో వచ్చే వారికి అందుబాటులో అత్యవసర సేవల కోసం ఆరు నెలల క్రితం మెదక్‌ ఎమ్మెల్యే, శాసనసభ ఉపసభాపతి çపద్మాదేందర్‌రెడ్డి మరో అంబులెన్స్‌ను మంజూరు చేశారు. అయితే ఆ అంబులెన్స్‌ను 3నెలల క్రితమే గజ్వేల్‌  ఏరియా ఆస్పత్రికి అక్కడి అవసరాలకోసం పంపించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కాని వంద పడకల ఆస్పత్రికి నాలుగు అంబులెన్స్‌లు ఉండాల్సి ఉండగా, ఒక్కటి మాత్రమే ఉండడంతో అత్యవసర సమయంలో అంబులెన్స్‌ లేక రోగులు పడుతున్న బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు.

ఉన్నవి మరమ్మతులు చేయించకుండా, స్థానిక ఎమ్మెల్యే మంజూరు చేసిన అంబులెన్స్‌ను మరో ఆస్పత్రికి తరిలించి ఏరియా ఆస్పత్రి నిర్వాహకులు ఇక్కడికి వచ్చే రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచి రోగులకు ప్రాణ నష్టం జరగకుండా చూడాల్సిన  అవసరం ఎంతైనా ఉందని ఆస్పత్రికి వచ్చే రోగులు, పట్టణ ప్రజలు కోరుతున్నారు.  
 
07ఎండికె06: ఏరియా ఆస్పత్రిలో చెడిపోయి వృథాగా పడిఉన్న అంబులెన్స్‌
  ========================================   
 

మరిన్ని వార్తలు