'గుర్తుతెలియని వ్యక్తయితే వైద్యం చేయరా?'

24 Jul, 2015 18:33 IST|Sakshi

చౌటుప్పల్: మానవత్వం చాటుకోవడానికి మనిషి పేరు, వివరాలు తెలియాల్సిన అవసరం ఉంటుందా? బాధితుడి చిరునామా తెలిస్తే తప్ప బాధ్యత నిర్వర్తించరా? గుర్తు తెలియని వ్యక్తయినంత మాత్రాన చికిత్స అందించకుండా చంపేస్తారా?.. ఇవీ చౌటుప్పల్ ప్రభుత్వ వైద్యశాల సిబ్బందిని ప్రజలు అడిగిన ప్రశ్నలు. వివరాల్లోకి వెళితే..

మూడు రోజుల కిందట చౌటుప్పల్ ప్రధాన రహదారిపై అపస్మారక స్థితితో పడిఉన్న ఓ వ్యక్తిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వైద్యులుగానీ, సిబ్బందిగానీ అతడ్ని పట్టించుకున్న పాపాపపోలేదు. గుర్తుతెలియని వ్యక్తికదా, అతడి గురించి మాకేంటనే నిర్లక్ష్యంతో అతడివైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అతను శుక్రవారం మృతిచెందాడు. ఈ తతంగాన్ని గమనించిన తొటి రోగులు విషయాన్ని స్థానిక సీపీఎం నాయకులకు చేరవేశారు.

ఆసుపత్రికి చేరుకున్న సీసీఎం నాయకులు వైద్యులను ప్రశ్నించగా.. గుర్తుతెలియని వ్యక్తిని గురించి పోలీసులకు సమాచారం అందించినా స్పందించలేదని, వివరాలు తెలుసుకోకుండా చికిత్స అందించలేమని సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహం చెందిన సీపీఎం నేతలు.. వైద్యుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. మరోవైపు ఆసుపత్రిలోని రోగులు కూడా వైద్యసిబ్బంది తీరుపట్ల అనేక ఆరోపణలు చేశారు. చికిత్స అందించే అవకాశం ఉండికూడా చిన్నచిన్న రోగాలకు సైతం హైదరాబాద్ కు వెళ్లాలంటున్నారన్నారు.

మరిన్ని వార్తలు