'వాళ్లంతా అవకాశవాదులు.. అందుకే వెళ్లారు' | Sakshi
Sakshi News home page

'వాళ్లంతా అవకాశవాదులు.. అందుకే వెళ్లారు'

Published Fri, Jul 24 2015 6:12 PM

'వాళ్లంతా అవకాశవాదులు.. అందుకే వెళ్లారు'

గతంలో కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన కె.కేశవరరావు, డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ తదితరులు అవకాశవాదులని, అందుకే వాళ్లు పార్టీని వీడారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లాలో పాదయాత్ర ముగిసిన అనంతరం పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడారు. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తే, ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ మనుగడ సాగిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని సూచించారు. ఆ రెండూ సాధిస్తే రాష్ట్రం ముందంజలో ఉంటుందని అన్నారు.

అన్ని పార్టీలూ ఆమోదం తెలిపిన తర్వాతే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు వసుంధరా రాజె, సుష్మా స్వరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్ దేశాన్నే దోచేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల అవినీతి పాలనను కాంగ్రెస్ బయటపెడుతుందనే ప్రధాని యోగా, అంతరిక్షం, విదేశీ పర్యటనలంటూ తప్పించుకుని తిరుగుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఎప్పుడు తీసుకుంటారని విలేకరులు ప్రశ్నించినప్పుడు మాత్రం రాహుల్ సమాధానాన్ని దాటవేశారు.

మీడియా సమావేశం ముగిసిన తర్వాత ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. నిన్నటి గురించి మర్చిపోవాలని, రేపటి గురించి ఆలోచించాలని ఉద్బోధించారు. విలువలతో కూడిన సిద్ధాంతాలు గల పార్టీ కాంగ్రెస్ అని చెబుతూ సీనియర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ భేటీలో కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. భేటీ అనంతరం రాహుల్ గాంధీ పుట్టపర్తి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరారు.

Advertisement
Advertisement