వ్యవసాయంలో ‘పశ్చిమ’ ఫస్ట్

26 May, 2016 08:54 IST|Sakshi
వ్యవసాయంలో ‘పశ్చిమ’ ఫస్ట్

జిల్లాలకు ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం
పారిశ్రామిక రంగంలో విశాఖకు మొదటి ర్యాంకు
అన్నింట్లోనూ చివరి స్థానాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు    
 
 సాక్షి, విజయవాడ బ్యూరో:  రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులిచ్చింది. 2015-16 సంవత్సరానికి రంగాలవారీగా ఈ ర్యాంకులు ప్రకటించారు. వ్యవసాయ రంగంలో పశ్చిమగోదారి జిల్లా మొదటి ర్యాంకు పొందగా కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ రంగంలో శ్రీకాకుళం జిల్లా అన్నిటికంటే వెనుకబడింది. మొత్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మూడూ వ్యవసాయ రంగంలో చివరి స్థానాల్లో నిలిచాయి. విశాఖపట్నం 11, విజయనగరం 12వ ర్యాంకు పొందాయి. అయితే పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం మొదటి ర్యాంకును సాధించింది. తూర్పుగోదావరి రెండు, కృష్ణా జిల్లా మూడో ర్యాంకును పొందాయి.

శ్రీకాకుళం జిల్లా ఈ రంగంలోనూ చివరి స్థానంలో నిలిచింది. సేవా రంగంలో విశాఖ, కృష్ణా, గుంటూరులు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఈ రంగంలోనూ చివరి స్థానాల్లో ఉన్నాయి. తలసరి ఆదాయంలో విశాఖపట్నం ముందుండగా కృష్ణా, పశ్చిమగోదావరి రెండు, మూడు ర్యాంకులు పొందాయి. వృద్ధి రేటులో కృష్ణాజిల్లా అగ్ర స్థానంలో ఉండగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర వృద్ధి రేటు 10.50 శాతం ఉండగా కృష్ణా జిల్లా వృద్ధి రేటు 12.88 శాతం, విశాఖ వృద్ధి రేటు 12.23 శాతంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా చిట్ట చివరన ఉంది. వృద్ధి రేటు, తలసరి ఆదాయంతో పాటు కీలకమైన మూడు రంగాల్లోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడ్డాయి. రాయలసీమ, ప్రకాశం నెల్లూరు జిల్లాలు మధ్య ర్యాంకులు పొందాయి.

మరిన్ని వార్తలు