వేసవిలోనూ మేడపై పచ్చని కూరలు!

22 May, 2018 05:21 IST|Sakshi

మేడపైన ప్రత్యేక కుండీలలో కాయగూరలు, ఆకుకూరలను సాగుచేస్తున్న ఉపాధ్యాయుడు

అతనో ఉపాధ్యాయుడు.. అయితేనేం, వ్యవసాయమంటే ఆసక్తి. ఆ ఆసక్తి తన ఇంటిపైనే కాయగూరలు, ఆకుకూరలు సాగు చేసేలా పురిగొల్పింది. దాంతో గడచిన నాలుగేళ్లగా వారంలో నాలుగు రోజులు చక్కని, రుచికరమైన, సొంతంగా పండించిన కూరలు తినగలుగుతున్నారు. ఆయన పేరు బిరుసు ఈశ్వరరావు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో సొంత ఇంటిలో ఈశ్వరరావు నివాసం ఉంటున్నారు. పాచిపెంట మండలంలోని పీ కోనవలస పాఠశాల ఉపాధ్యాయుడిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. తన ఇంటిమేడపైన నాలుగేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చుక్కకూర, తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీరతోపాటు వంగ, టమాట, ఆనప, ముల్లంగి తదితర పంటలు సాగు చేస్తున్నారు. మండు వేసవిలోనూ ఆయన మేడపైన పచ్చని కూరగాయల తోట కొనసాగుతోంది.

ప్రత్యేక మడులు.. మట్టి కుండీలు..
రకరకాల మొక్కలను పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇటుకలు, సిమెంటుతో మడులను కట్టించుకున్నారు. అడుగు ఎత్తున దిమ్మెలపైన సిమెంట్‌ పలకలతో మడులను నిర్మించారు. వీటిలో పశువుల గెత్తం(పశువుల ఎరువు), చెరువుమట్టిని కలిపి పోశారు. ఆకుకూరలు, ఆనప వంటి తీగజాతి కూరగాయ పాదులను వీటిల్లో సాగు చేస్తున్నారు. వంగ, టమాట తదితరాల కోసం పూల మొక్కల గోళాల (మట్టి కుండీలు, ప్లాస్టిక్‌ డబ్బాల)నే వినియోగిస్తున్నారు. ఇంటిపంటల కోసం విజయనగరం మార్కెట్లో విత్తనాలను కొనుగోలు చేస్తూ, ఇంటి అవసరాలను బట్టి, కొద్ది కొద్దిగా విత్తుకుంటారు. ప్రతీ 15 రోజుల వ్యవధిలో ఆకుకూరల విత్తులు విత్తుతూ.. ఆరోగ్యకరమైన కూరలకు ఏడాది పొడవునా లోటు లేకుండా చూసుకుంటున్నారు. మేలైన హైబ్రిడ్‌ రకాలనే ఎన్నుకుంటున్నాని ఈశ్వరరావు తెలిపారు. తెగుళ్లు పెద్దగా రావన్నారు. పురుగులు ఏవైనా కనిపిస్తే చేతులతో ఏరి పారేస్తున్నామన్నారు. ఇలా చేయాలనుకునే వారు వచ్చి అడిగితే.. మొదటి నుంచి చివరి వరకు ఎలా చేయాలో, ఏమి చేయాలో పూర్తిగా చెప్పడానికి ఈశ్వరరావు సంసిద్ధంగా ఉన్నారు.

నాలుగేళ్లుగా పండించుకుంటున్నా..
నాకు చిన్నతనం నుండి వ్యవసాయమంటే ఆసక్తి. దాంతోనే మేడపై కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టాను. నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా పెంచుతున్నాను. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, మంచి వ్యాపకం దొరుకుతోంది. రోజుకు 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతోంది. మండు వేసవిలో కూడా చాలా తక్కువ ఖర్చుతో ఆకుకూరల సాగు చేయగలుగుతున్నాను.


– బిరుసు ఈశ్వరరావు (94411 71205), సాలూరు, విజయనగరం

– కొల్లి రామకృష్ణ, సాక్షి, సాలూరు, విజయనగరం

మరిన్ని వార్తలు