గ్రాస్‌ రూట్‌ ఆర్ట్‌ వరిగడ్డితో కళాఖండాలు

23 Dec, 2019 01:12 IST|Sakshi

గడ్డిపరకళ

పచ్చని పంటచేలో మట్టితో మమేకమయ్యే ఆ చేతులు... గడ్డిపోచలతో విన్యాసాలు చేస్తాయి. గిత్తల గిట్టల చప్పుళ్లతో జత కలిసి నాగేటిచాళ్లలో తిరగాడే ఆ కాళ్లు... సన్నటి గడ్డి దారాలను రూపొందించడంలో,  పేనడంలో సాయం పడతాయి. బంగారు వర్ణాల కంకులను చూసి మెరిసిపోయే ఆ కళ్లు... నిశిత దృక్కులతో పెక్కు కళాఖండాలను ఆవిష్కరిస్తాయి. సత్తువ ఉడుగుతుందని అనుకునే ఎనిమిది పదులకు చేరుతున్న ఆయన వయసు ఉరకలెత్తుతున్న ఆ నైపుణ్యం ముందు తలవాల్చి ఎందరికో స్ఫూర్తినిస్తుంది. ఆయనే కృష్ణమూర్తి అనే ఓ మామూలు రైతు.

గడ్డిపరకల విన్యాసం  కాదది... గడ్డిపర‘కళ’ల కళావైభవం. ఈ గరికపర‘కళ’లను ఆవిష్కరిస్తున్న ఆయన పేరు మువ్వా కృష్ణమూర్తి. ఊరు ప్రకాశం జిల్లాలోని పర్చూరు మండలానికి చెందిన వీరన్నపాలెం గ్రామం.  
వరిగడ్డి పశువులమేతకు తప్ప మరెందుకూ పనికిరాదని మనలో చాలామంది అనుకుంటుంటారు. కానీ కృష్ణమూర్తి దాన్ని అబద్ధం చేశారు. అందరిలాగే తానూ పంటలు పండించటం వరకే పరిమితమైతే ఏం లాభం... తనకంటూ ప్రత్యేకత ఉండాలని భావించాడా కృషీవలుడు. ఆసక్తి ఉండాలేగానీ మామూలు వ్యవసాయదారుడు కూడా కళాకారుడవుతాడని నిరూపించాడా నిరుపేదరైతు. 

అద్భుత కళాఖండాలను సృష్టిస్తున్నారాయన. ఆ కళాకృతులను చూస్తే ఆశ్చర్యాలే. వాటిని మలిచే ఆ ముడిసరుకును చూస్తే అబ్బురాలే. అటు గరికపోచలే కాదు... కొన్నిసార్లు తుంగపీచులు, జొన్నఈనెలు, ఈతఆకులు  వగైరాలతో సున్నితంగా పేనుకుంటూ, వాటిని ప్రయోజనకరమైన వస్తువులుగా రూపొందించేందుకు పూనుకుంటున్నారు. కొన్ని అందమైన పనిముట్ల నమూనాలను కూడా మలుస్తుంటారు. అయితే సహజంగా సేద్యం చేసేవాడు కదా... తన వ్యవసాయాభిరుచితో, తన కళాభిరుచిని కలగలిపి ‘పొలంపనిముట్ల’ నమూనాలనూ తయారు చేస్తుంటారు.  

ఎవరీ కృష్ణమూర్తి...
మువ్వా కృష్ణమూర్తి ప్రకాశం జిల్లా, పర్చూరు మండలం, కొమర్నేనివారిపాలెం గ్రామంలో 07–04–1942న పుట్టారు. తండ్రి పేరు సుబ్బన్న,  1965లో తన పెళ్లయినప్పట్నుంచి వీరన్నపాలెం గ్రామంలో నివాసం ఉంటున్నారు. చదివింది ప్రాథమిక విద్య మాత్రమే. పిల్లలంతా స్థిరపడ్డారు. ప్రస్తుతం తన కూతురు వద్దే నివాసం. అందరిలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలనే తపన చిన్ననాటినుంచీ ఉండేది. దాంతో...  కళాత్మకమైన వస్తువులు, పనిముట్లు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది.  ఆ ప్రయత్నంలో  వరిగడ్డి, తుంగనార, జొన్నఈనెలు, తాటాకులు, కొబ్బరి నార, చిప్పెరకంకి, జమ్ము... ఇలా రకరకాలైన
వస్తువులతో తొలుత వస్తువుల తయారీకి ప్రయత్నించాడు.

‘పరకా’యించి చూశాడు...
ఒకరోజు గడిపరకను పరకాయించి చూస్తుండగా ఓ ఆలోచన వచ్చింది. గడ్డిపరకలతో  చీరనేస్తే ఎలా ఉంటుందన్నదే ఆయన యోచన. తన యోచననూ... ఆలోచననూ కార్యరూపంలో పెట్టాడు. పని మొదలైంది కానీ పట్టుచిక్కలేదు. ఎన్నిసార్లు నేసినా గడ్డి విరిగిపోతోంది. దాంతో వరిగడ్డిని తొలుత బాగా ఎండనిచ్చారు. దానిని చాకుతో సన్నగా నిలువుగా కత్తిరించారు. ఆ పోగులను సన్నని దారాలుగా పేనారు. ఆ చిన్న చిన్న దారం ముక్కలను కలుపుకుంటూ పొడవైన దారంగా మలచుకున్నారు. వీటికోసం ఆయన ఎలాంటి పరికరాలనూ వాడలేదు. ఏ ఉపకరణాలనూ ఉపయోగించలేదు. అన్నీ తన చేతుల్తోనే. ఓర్పుగా, నేర్పుగా చేసుకుంటూ పోతున్నకొద్దీ తన నిపుణతలోనూ మార్పు కనిపించింది. ఎంతో శ్రమించి చెర్నోకోల, నాగలి, సిగమారలు, చిక్కాలు, కండువ, చీర, రవిక, చేతి సంచులు వంటి వస్తువులును తయారు చేశారు.

వరిగడ్డి త్వరగా చేడిపోదు కాబట్టి దానిని భద్రపర^è డంలో ఇబ్బంది ఏమీ ఉండదని అంటారాయన. ఈ కళాకారుడి ప్రతిభకి స్థానికుల  నుంచే కాక, రాష్ట్ర, జాతీయ స్థ్దాయిలో కూడా అనేక ప్రశంసలు అందాయి. తాను నేసిన వరికండువాను భారత రాష్ట్రపతికీ, ప్రధానమంత్రికీ బహూకరించాలన్నది కృష్ణమూర్తి ఆలోచన. వరిగడ్డితో రూపొందించిన ఆ కళాకృతులను చూసిన ఎందరో పెద్దల నుంచి ప్రశంసలే కాదు... రెండు పదులకు మించి మరెన్నో పురస్కారాలందుకున్నారు మువ్వా కృష్ణమూర్తి. రాష్ట్రస్థాయిలో పశుసంవర్ధక శాఖతో పాటు అనేక సంస్థల నుంచి నుంచి చాలా సత్కారాలనూ, పురస్కారాలను పొందారు. తనతోనే ఈ కళ అంతరించిపోకుండా తర్వాత కూడా కొనసాగాలన్నదే ఆయన కోరిక.
– పాలేరు శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి, పర్చూరు

ముందుకెవ్వరూ రావడం లేదు
నా వయసిప్పుడు 78 ఏళ్లు. ఇప్పటికీ నా పనులు నేనే చేసుకుంటుంటాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాను. నాలో ఓపిక నశించేలోగా నా కళను ఇతరులకు నేర్పాలన్నది నా ఆలోచన. ఔత్సాహికులెవరైనా ముందుకొస్తే తప్పకుండా నేర్పుతాను.

– మువ్వా కృష్ణమూర్తి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా