మహాత్ముని మరణం 30 జనవరి 1948

30 Jan, 2018 00:03 IST|Sakshi
గాంధీజీ

చెట్టు నీడ

వడివడిగా, వేగంగా ప్రార్థనకు నడుస్తూ వస్తున్నారు గాంధీజీ. బిర్లాహౌస్‌ (ఢిల్లీ) మైదానంలోని జనం లేచి ‘బాపూజీ, బాపూజీ’ అని ఆరాధనతో తన్మయమౌతున్నారు. అచ్ఛాదన లేని ఆయన ఛాతీ ఎన్ని మృత్యువులనైనా చేరదీసి, సేదతీర్చే ప్రేమ మందిరంలా ఉంది. మళ్లొకసారి తుపాకీ సర్దుకున్నాడు గాడ్సే. గాంధీజీకి ఎదురు నడుస్తున్నాడు గాడ్సే.  మృత్యువా? మహాత్ముడా? ఎవరు ఎవరిని గౌరవిస్తారో, ఎవరు ఎవరికి శిరస్సు వంచి నమస్కరిస్తారో, ఎవరు ఎవరిని అంతిమంగా ఒడిలోకి తీసుకుంటారో.... కొద్దిసేపట్లో తేలిపోతుంది. గాంధీజీకి ఇటు మనూ, అటు అభా ఉన్నారు. తృటిలో మృత్యువు అక్కడికి చేరుకుంది. గాంధీజీకి అతి దగ్గరగా వచ్చి, వంగి, చేతులు జోడించాడు గాడ్సే. ఆ చేతుల మధ్య తుపాకీ ఉంది!

మృత్యువును జయించడమంటే... మృత్యువును వట్టి చేతులతో సాగనంపడం కాదని మహాత్ములు మాత్రమే అనగలరు. ఇవ్వడానికి గాంధీజీ దగ్గర నిండు ప్రాణాలున్నాయి. తృణప్రాయంగా వాటిని అర్పించగల గుండె ధైర్యం ఉంది.   మహాత్ముని శరీరంలోకి మూడు గుండ్లు దూసుకెళ్లాయి. కోట్ల హృదయాలకు తూట్లు పడ్డాయి. బాపూజీ భౌతికంగా మరణించి నేటికి డెబ్భై ఏళ్లు. ఆయన అనుసరించి, మానవాళికి అందించి వెళ్లిన జీవిత సందేశాలు మాత్రం ఏనాటికీ మరణం లేనివి. 

మరిన్ని వార్తలు