మహామహిళ

25 Nov, 2019 02:30 IST|Sakshi

పరిచయం సుప్రియా సూలే, ఎంపీ

‘గేమ్‌ 145’. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ అది. ఈ గేమ్‌ ఫలితం.. ‘పార్టీ, ఫ్యామిలీ రెండూ చీలిపోయాయి’ అని సోషల్‌ మీడియాలో సుప్రియా సూలే పోస్ట్‌! తన తండ్రి, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ను తన పెదనాన్న కొడుకు అజిత్‌ పవార్‌ వెన్నుపోటు పొడిచాడని సుప్రియా సూలే ఆరోపణ. అజిత్‌ పవార్‌ నిర్ణయాన్ని దుయ్య బడుతూ, అతడి అవకాశవాదంపై నిప్పులు చెరగడంతో తాజాగా వార్తల్లోకి వచ్చిన సుప్రియా సూలేని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన రాజకీయేతర, మహిళా ఉద్యమ అంశాలు అనేకం ఉన్నాయి.

సుప్రియ దక్షిణాదికి తెలిసింది ఎన్‌సీపీ నాయకుడు శరద్‌పవార్‌ కూతురిగా మాత్రమే. యాభై ఏళ్ల సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి పార్లమెంట్‌ సభ్యురాలు. మహిళల సాధికారత, ఆదివాసీల హక్కుల కోసం ఆమె నిరంతరం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉన్నత విద్యావంతురాలు, నిరాడంబరంగా ఉంటారు. 2011లో ఆడశిశువుల గర్భస్థ హత్యలకు నిరసనగా ఉద్యమించారు. ఆమె చేసిన సామాజిక సేవకు గుర్తుగా ఆల్‌ లేడీస్‌ లీగ్‌ నుంచి ‘ముంబయి ఉమెన్‌ ఆఫ్‌ ద డికేడ్‌ అచీవర్స్‌’ అవార్డు అందుకున్నారు.

మూడో కంటికి తెలియదు
సుప్రియా సూలే తల్లిదండ్రులు శరద్‌పవార్, ప్రతిభాతాయి. సుప్రియ పూనాలో పుట్టారు. ముంబయిలోని జై హింద్‌ కాలేజ్‌లో మైక్రో బయాలజీలో బీఎస్సీ చేశారు. భర్త సదానంద బాలచంద్ర సూలే మల్టీ నేషనల్‌ కంపెనీలకు ఐటీ కన్సల్టెంట్‌. పెళ్లి తర్వాత ఈ దంపతులు కాలిఫోర్నియాకు వెళ్లిపోయారు. సుప్రియ అక్కడ బర్కిలీ యూనివర్సిటీలో వాటర్‌ పొల్యూషన్‌ మీద పీజీ చేశారు. ఆ తర్వాత కొన్నేళ్లు సింగపూర్, ఇండోనేసియాల్లో ఉద్యోగం చేసి ఇండియాకి వచ్చారు. ఆమెకి ఒక కొడుకు విజయ్, కూతురు రేవతి. ఇంత వరకు ఆమె జీవితం మూడో కంటికి తెలియకుండా గడిచిపోయింది.

తొలి అడుగు రాజ్యసభలో
ఇండియాకి వచ్చిన తరవాత సుప్రియా సూలే ముంబయిలోని నెహ్రూ సెంటర్‌ కమిటీలో ట్రస్టీగా చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈ క్రమంలో 2006లో రాజ్యసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా సుప్రియ జీవితం మలుపు తీసుకుంది. సుప్రియను రాజ్యసభకు నామినేట్‌ చేయాలన్న తన ఆలోచనను శరద్‌ పవార్‌ పార్టీ సమావేశంలో ప్రతిపాదించారు. శరద్‌ పవార్‌ నోటి వెంట సుప్రియ పేరు వినగానే పార్టీ శ్రేణుల కనుబొమలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. శరద్‌ పవార్‌ రాజకీయ వారసత్వం ఎవరికి దక్కబోతోంది.. అని భ్రుకుటులు ముడివడ్డాయి. ఇప్పటి వరకు అజిత్‌ పవారే వారసుడు అనుకున్న వాళ్లలో అజిత్‌ కలకాలం ఆ సెకండ్‌ పొజిషన్‌లో ఉండలేక పోవచ్చు అని కూడా అనుకున్నారు. సుప్రియ మాత్రం రాజ్యసభ స్థానానికి నామినేషన్‌ వేసిన క్షణం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు.

పార్టీ వ్యవహారాలకంటే కూడా ఆమె గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మీదనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఆదివాసీలు నివసించే ప్రదేశాల్లో ఆ పిల్లల కోసం స్కూళ్ల స్థాపన, నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మహిళా సాధికారత కోసం రాష్ట్రవ్యాప్తంగా సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్‌ల ఏర్పాటులో పని చేశారు. ఆమె స్వయంగా ‘యశస్విని ఉమెన్స్‌ గ్రూప్‌’ నిర్వహిస్తున్నారు. ఆదివాసీల పిల్లల్లో పోషకాహారలోపాన్ని నివారించడానికి ఆమె పెద్ద ప్రయత్నమే చేశారు. ఇందుకోసం పార్టీలకతీతంగా స్థానిక నాయకత్వాన్ని కలుపుకుని పనిచేశారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో (ట్రైబల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌) వసతుల కల్పన కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. ఒక రాజకీయ నాయకురాలిగా కంటే సామాజిక కార్యకర్తగానే సేవలందించారు సుప్రియ.

తండ్రి స్థానం నుంచి
ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉండగానే 2009లో లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో అప్పటి వరకు  తండ్రి శరద్‌పవార్‌ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు సుప్రియ. అప్పటి నుంచి వరుసగా మూడు ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మోదీ హవా దేశాన్ని ఒకే తీరుగా నడిపించిన ఎన్నికల్లో కూడా సుప్రియ తన గెలుపు తానే శాసించగలిగారు. ఆమె తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటికీ, నామమాత్రపు పాత్రగా మిగిలిపోలేదు. తలకెత్తుకున్న బాధ్యతకు నూటికి నూరుశాతం న్యాయం చేయాలనే దీక్ష ఉన్న వ్యక్తి. పార్లమెంట్‌ సభ్యురాలిగా ఆమెకు 96 శాతం అటెండెన్స్‌ ఉంది. ఆమె 136 డిబేట్‌లలో పాల్గొన్నారు. పదకొండు వందలకు పైగా ప్రశ్నలను సంధించారు. ఇరవై ప్రైవేట్‌ బిల్లులను ప్రవేశ పెట్టారు.

సామాజిక మార్పు కోసం
లోక్‌సభకు ఎన్నికైన తర్వాత సుప్రియ రాష్ట్రవ్యాప్తంగా మహిళా చైతన్య ఉద్యమాన్ని చేపట్టారు. గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్‌ చేయించుకోవడం అనేది సామాజిక రుగ్మతగా మారిపోయిందని ఆవేదన చెందేవారామె. ఈ పరిస్థితిని సమూలంగా నివారించడానికి కంకణం కట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యవంతం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని కడుపులో ఉన్నది ఆడపిల్ల అయితే అబార్షన్‌ చేయించుకోవడం మీద తీవ్రంగా గళమెత్తారు సుప్రియ. ‘ఆడపిల్లను పుట్టనివ్వండి’ అని రాష్ట్రమంతా పాదయాత్రలు, కాలేజీల్లో సభలు– సమావేశాలతోపాటు విద్యార్థుల్లో ఈ టాపిక్‌ మీద వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. మొత్తం రెండు వేల కాలేజీలను సందర్శించారు.

సుప్రియ ఈ కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే సొంతూరు నాయిగావ్‌ నుంచి ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఐదు వందల మంది బాలికలు నాయిగావ్‌కి వచ్చి కవాతులో పాల్గొన్నారు. పూనాలో మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో మూడు వేల మంది బాలికలు పాల్గొన్నారు. మహారాష్ట్ర ప్రోగ్రెసివ్‌ స్టేట్‌గా మారాలని, ఆ మార్పులో అందరూ భాగస్వాములు కావాలని సుప్రియ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో మహిళలే కాదు మగవాళ్లు కూడా పాల్గొనాలని చెప్పారామె. ఈ సందర్భంగా ఆమె డాక్టర్‌ల మీద పెద్ద బాధ్యతనే పెట్టారు. ‘లింగ నిర్ధారణ పరీక్షలు చేయను’ అని ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణ పాటించాలని డాక్టర్లను కోరారు.

వివాదాల మబ్బు తెరలు
సుప్రియ ఒక ప్రజాప్రతినిధిగా, సామాజిక కార్యకర్తగా తనకు తానుగా ఏర్పరుచుకున్న ఒక సామ్రాజ్యం ఐపీఎల్‌ వివాదం మబ్బు తెరలా ఆవరించింది. సుప్రియ భర్త సదానంద సూలే తండ్రి బీ ఆర్‌ సూలే మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీలో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా రిటైర్‌ అయ్యారు. ‘‘ఆయన 1992 నుంచి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌కి చైర్మన్‌ అనే విషయం ప్రపంచానికి తెలుసు, ఇందులో దాపరికం ఏమీ లేదని పదిశాతం వాటా సదానంద సూలేకి అతడి తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది.

ఆయనకు వయసు మీద పడడంతో మల్టీ స్క్రీన్‌ మీడియా (ఒకప్పటి సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌) బాధ్యతను తన భర్త చేపట్టారు’’ చెప్పారామె. ‘‘మాకు క్రికెట్‌ అంటే ఇష్టం. నేను, నా భర్త, పిల్లలు, మా కుటుంబంలో అందరమూ క్రికెట్‌ను చాలా ఇష్టంగా చూస్తాం. అయితే ఐపీఎల్‌ బిడ్స్‌ విషయంలో మా కుటుంబానికి కానీ, నా భర్తకు కానీ ఎటువంటి ప్రమేయం లేదు. మేమెప్పుడూ వీటికి దూరంగానే ఉంటున్నాం’’ అని చెప్పారు.

యువతుల్లో చైతన్యం కోసం
మహిళా సాధికారత సాధించిన సమాజం ప్రగతిబాటలో నడుస్తుంది. వరకట్నం, ఆడపిల్లల పట్ల వివక్ష వంటి జాడ్యాలను వదిలించుకున్నప్పుడే రాష్ట్రం అభ్యుదయ పథంలో నడుస్తుందంటారు సుప్రియ. యువతుల్లో రాజకీయ చైతన్యం కలిగించడానికి 2012లో ‘రాష్ట్రవాది యువతి కాంగ్రెస్‌’ను స్థాపించి, యువతులను రాజకీయరంగంలోకి ఆహ్వానించారు. ‘‘ప్రజలు రాజకీయాల పట్ల, ఇప్పుడు ఉన్న వ్యవస్థ మీద విశ్వాసాన్ని మాత్రమే కోల్పోతున్నారు, ఆశావహ దృక్పథాన్ని కోల్పోవడం లేదు’’ కాబట్టి వివేచన పరులైన యువతులు చదువుకుని సమాజాన్ని నడిపించాలంటారు సుప్రియ. – వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు