మిత్ర ధర్మంలేని మహా కూటమి

20 Nov, 2018 00:46 IST|Sakshi

తెలంగాణ ఉద్యమానికి ద్రోహులుగా నిలిచినవారు, ఉద్యమాన్ని అడుగడుగునా అణిచేసినవారు, అధికారమే పరమావధిగా భావించేవారు మహాకూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. తీరా నామినేషన్ల గడువు ముగిసినా వారి మధ్య సీట్ల సర్దుబాటు కాలేదు. దాదాపు 25 స్థానాల్లో ఒకరిపై ఒకరు పోటీలకు దిగుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి వీళ్ల స్థితి ఎక్కడిదాకా పోతుందో తెలియదు. మహాకూటమిలోని నేతలే ఒకర్ని ఒకరు నమ్ముకునే దశలో లేరు. వీళ్లు కలవటం కష్టమని నామినేషన్లు వేసేటప్పుడే తెలిసిపోతే వీళ్ళేం పాలన అందిస్తారన్నది మరో అంశం. అసలు మహాకూటమిలో మిత్రధర్మం ఎక్కడుంది? మిత్రధర్మమే పాటించని వాళ్లు ప్రజాధర్మాన్ని  ఎట్లా నిర్వర్తించగలరు?  ఒకరికి కేటాయించిన స్థానంలో ఇంకో మిత్ర పక్షం వచ్చి పోటీదారుగా నిలుస్తుంటే ప్రజలు వీళ్లను ఎలా చూస్తారు? ఈ కూటమి సైద్ధాంతిక విషయాల ఐక్యతతో కలవలేదు. తెలం గాణ అస్తిత్వం, తెలంగాణకు స్వయంపాలనాధికార శక్తి కావాలన్న అంశాన్ని టీడీపీ ఒప్పుకుంటుందా? ఎందుకంటే, తెలంగాణ నీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ వేయని కేసులేదు. వీళ్లతో కాంగ్రెస్‌ ప్రధానపక్షం పొత్తుపెట్టుకుంది. ఇది ప్రజలు మానసికంగా ఒప్పుకోలేని కలయిక. ఈ కూటమి పనంతా కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన నాలుగున్నరేళ్ల పాలనపై దుమ్మెత్తిపోయటమే.

ప్రపంచంలో ఆత్మ విశ్వాసానుకన్నంత బలం దేనికీ లేదు. ఇద్దరు కలిసి జీవించటానికి, ఒక సమూహం కలిసుండటానికి, ఒకరిపై యుద్ధం చేసి గెలవటానికి కావాల్సింది ఆత్మవిశ్వాసం. ఒక వ్యవస్థను నిలబెట్టడానికి నాయకునికి ఉండాల్సింది విశ్వాసం. నాయకునికి ఆత్మవిశ్వాసం లేకుండా ఏ పనిలోనూ విజయం సాధించలేరు. ఆ తరహా విశ్వాసం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది. 

తెలంగాణ రాష్ట్రసాధన మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు పిడికెడు మంది కూడా లేరు. తెలంగాణ తనను తాను పాలించుకునేందుకు ప్రత్యేక రాష్ట్రం ఒక్కటే ధ్యేయమని, ప్రజలను కదిలించే నాయకునిగా, ధైర్యశాలిగా ఆత్మవిశ్వా సంతో కేసీఆర్‌ ఒక్కరే కదలివచ్చారు. ఆ విశ్వా సంతోటే 2001 ఏప్రిల్‌ 27న ఉద్యమజెండా పట్టుకున్న కేసీఆర్‌ 14 ఏళ్లు తన వజ్ర సంకల్పం వదులుకోలేదు. ఉద్యమ సమయంలో విశ్రాంతి లేకుండా ప్రజలతో కలిసిపోరాడారు.  కేసీఆర్‌ దమ్మున్నోడు, ధైర్యమున్న మొనగాడు అన్న విశ్వసాన్ని కాళోజీ నారాయణ రావు దగ్గర్నుంచి మహాజనావళి వరకు అందరిలో కలిగించారు. ఉద్యమ జ్యోతిని ఆరిపోకుండా దూసుకుపోయాడు. 

ఆనాటి ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ తప్ప మిగిలిన పార్టీలన్నీ ప్రజలతో దొంగాటలాడాయి. అసలు తెలంగాణ రాష్ట్రమే రాదన్న నమ్మకంలో ప్రధాన పార్టీలున్నాయి. 2014 జూన్‌ 2న తెలంగాణ అవతరించిన తర్వాత అందరూ స్వరాలు మార్చారు. అధికారం కైవసం చేసుకుందామని కలలుగన్నారు. కానీ, ప్రజలు మాత్రం కేసీఆర్‌నే నమ్మారు. ఉద్యమద్రోహులను పక్కన బెట్టారు. కేసీఆర్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణ ముఖ చిత్రం మార్చేందుకు ఎంతో శ్రమించారు. తన మంత్రివర్గం, అధికార యంత్రాంగాన్ని పునర్నిర్మాణంలో నిమగ్నం చేశారు. 

కేసీఆర్‌ చేపట్టిన రైతు, సంక్షేమ పథకాలు అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కేసీఆర్‌ 14 ఏళ్ల ఉద్యమ సమయంలో కానీ, ఈ 51 నెలల పాలనలో గానీ ఎప్పుడూ అధైర్యపడలేదు. ఇపుడు తెలంగాణకు మిన్నువిరిగి మీదపడినా తలవంచక పోరాడి గెలిచివచ్చే కేసీఆర్‌లాంటి యోధుడే కావాలి. గుండెధైర్యం, ఆత్మవిశ్వాసం, తెలంగాణ పునర్నిర్మాణం ధ్యేయంగా ముందుకు సాగే కేసీఆర్‌లాంటి సైనికుడే కావాలి. పునర్నిర్మాణం జరుగుతున్న ఈ సమయంలో ఒక్క అడుగు తప్పుపడ్డా, వెనక్కు వేసినా అది మొత్తం తెలంగాణ సమాజానికి ప్రమాదం. తెలంగాణ పునర్నిర్మాణ పనులను, సంక్షేమ పథకాల కొనసాగింపు, కాళేశ్వరం లాంటి నీటిప్రాజెక్టుల సత్వర పూర్తికి ఓటువేయాలి. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనల్లో తెలంగాణ సర్వనాశనమైంది. తెలంగాణ తన అస్తిత్వంలో, తన ముద్రతో, తన శక్తితో ఎదుగుతున్న ఈ కీలక మలుపులో కేసీఆర్‌ ఒక చారిత్రక అవసరం. అభివృద్ధి నిరోధకులకు, తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్లకు చెల్లుచీటి చెప్పకతప్పదు. తెలంగాణ పునర్నిర్మాణానికి కట్టుబడి ముందుకు దూసుకుపోతున్న కేసీఆర్‌కు ఓటమిలేదు.
జానపాడు సైదులు, సామాజిక విశ్లేషకులు

మరిన్ని వార్తలు