భారీ దోపిడీ సూత్రధారి...బాధితుడి మిత్రుడే

9 Jul, 2016 20:43 IST|Sakshi
భారీ దోపిడీ సూత్రధారి...బాధితుడి మిత్రుడే

హైదరాబాద్: డబ్బు కక్కుర్తితో మిత్రుడి ఇంట్లోనే భారీ దోపిడీ చేసిన ప్రధాన నిందితుడుతో పాటు ఈ దోపిడీలో భాగస్వామ్యులైన మరో నలుగురిని సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే అరెస్టు చేశారు. బాధితురాలికి వచ్చిన అనుమానంతో ఈ కేసును ఛేదించిన పోలీసులు రూ.33 లక్షల నగదుతో పాటు 15 తులాల బంగారు ఆభరణాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మేడిపల్లి దోపిడీ కేసు వివరాలను శనివారం మీడియాకు తెలిపారు.

వృత్తిరీత్యా పెయింటర్ అయిన బోడుప్పల్ వాసి ఈతకోట గోపాల కృష్ణ, మేడిపల్లి సరస్వతీనగర్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డి చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు. చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి తరుచుగా వచ్చే గోపాలకృష్ణ అందరితో మంచిగా ఉండేవాడు. కాగా, ఇటీవలే చంద్రశేఖర్ రెడ్డి పర్వతాపూర్‌లో ఓ స్థలం విక్రయిస్తే రూ.30 లక్షలు వచ్చాయి. ఈ విషయం తెలిసిన గోపాలకృష్ణ ఆ డబ్బు కొట్టేయడానికి పథకం వేశాడు. అదను కోసం వేచి చూశాడు. ఈ నెల 5వ తేదీన చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ వెళ్లిన విషయం తెలుసుకున్న గోపాలకృష్ణ తన పథకాన్ని అమల్లో పెట్టాడు. ఇంట్లో చంద్రశేఖర్ రెడ్డి తల్లి బాలమణి ఒక్కతే ఉంటుందని, ఆమెకు కూడా మద్యం తాగే అలవాటు ఉండటంతో స్నేహితుడు, జిమ్‌కోచ్ అయిన రాగిరిబాబుతో కలిసి మద్యం తీసుకొని వెళ్లాడు. ముగ్గురు కలిసి మద్యం తాగారు.

ముందుగా అనుకున్న ప్రకారం బాలమణికి మత్తు వచ్చే వరకు మద్యం తాగించారు. అనంతరం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఆ ఇంటి నుంచి వారు బయటకు వచ్చారు. ప్లాన్ ప్రకారం స్నేహితులైన ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి రాజేందర్, డిగ్రీ విద్యార్థి నవీన్‌కుమార్, పశుసంవర్ధనశాఖలో ఔట్‌సోర్స్ ఉద్యోగి మదుసూదన్‌గౌడ్‌లను రప్పించి ఇంట్లో నగదు, బంగారం ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి తీసుకురావాలన్నారు. గోపాలకృష్ణ, రాగిరి బాబు, మధుసూదన్‌గౌడ్‌లు ఇంటి బయటే కాపలాగా ఉన్నారు. రాజేందర్, నవీన్‌కుమార్ సొత్తు దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లారు. వీరి అలికిడికి అప్రమత్తమైన బాలమణి కేకలు వేయబోయింది. దీంతో వారు ఆమె కాళ్లు, చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్‌నే వేసి, సొత్తుతో బయటకు వచ్చారు. నగదును, బంగారాన్ని పంచేసుకొని ఎవరి ఇళ్లలోకి వారు వెళ్లిపోయారు.

ఆరోతేదీ తెల్లవారు జామున బాలమణి నోటికి ఉన్న ప్లాస్టర్ ఊడిపోవడంతో ఆమె కేకలు విన్న పొరుగింటివారు వచ్చి కట్లను విప్పారు. ఆ తర్వాత కుమారుడు చంద్రశేఖర్‌కు జరిగిన విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదుచేశాడు. సంచలనం సృష్టించిన ఈ భారీ దోపిడీ కేసును బాలమణికి వచ్చిన అనుమానాన్ని ఆధారంగా చేసుకొని పక్కా ప్లాన్‌తో పోలీసులు 48 గంటల్లో ఐదుగురిని పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేసిన పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును వేగవంతంగా ఛేదించిన మేడిపల్లి పోలీసులను సైబరాబాద్(ఈస్ట్) కమిషనర్ మహేష్‌భగవత్ అభినందించి రివార్డులను అందించారు.

మరిన్ని వార్తలు