వింత వ్యాధి.. కథ మళ్లీ మొదటికే!

2 Feb, 2018 14:36 IST|Sakshi

ఢాకా : మాములు మనిషిగా మారేందుకు చెట్టు మనిషి ‘అబుల్ బజందర్’  చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. వైద్యులు చేసిన సర్జరీలు ఫలించకపోగా.. ఇప్పుడు మళ్లీ అతని చేతిపై కుక్క గొడుగుల్లాంటి ఆకారాలు మొలవటం ప్రారంభమైంది. దీంతో అతను ఆందోళనకు గురవుతున్నాడు. 

25 ఏళ్ల బజందర్ దాదాపు పన్నెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే చర్మ వ్యాధి అతనికి సోకింది. అది కాస్త ముదరటంతో  చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీద పెరిగిపోగా.. ఆ బాధతో అతను నరకం అనుభవించాడు. 2016లో ఇతని గురించి మొదటిసారి వార్తలు వెలువడగా.. బంగ్లా ట్రీ మ్యాన్‌(చెట్టు మనిషిగా) అతని పేరు పాపులర్‌ అయిపోయింది. ఢాకాలోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి అతనికి ఉచితంగా చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. శస్త్రచికిత్స ద్వారా వింత వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తామని అతనికి వైద్యులు మనోధైర్యం కల్పించారు. 

చివరకు గతేడాది 24 సర్జరీలు చేసి వాటిని తొలగించటంతో.. ఇక మాములు మనిషిని అయిపోయానని అతను సంతోషించాడు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన చికిత్స అని బంగ్లాదేశ్‌ వైద్యులు కూడా గర్వంగా ప్రకటించుకున్నారు. ఇక శస్త్ర చికిత్సల అనంతరం పరిశీలన కోసం ఏడాది నుంచి అతను ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. ఓ చిన్న గదిలో భార్య కూతురుతోపాటు అతను నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. 

అతను మెరుగవటానికి కాస్త సమయం పట్టొచ్చని.. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యుడు సమంత లాల్‌ సేన్‌ చెబుతున్నారు. కానీ, బజందర్‌ మాత్రం వణికిపోతున్నాడు. ‘‘ఇంక నాకు ఎలాంటి శస్త్ర చికిత్సలు వద్దు. నా కాళ్లు చేతులు బాగుపడతాయనే నమ్మకం పోయింది. నేను చనిపోయినా ఫర్వాలేదు. నన్ను బయటికి పంపించేయండి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నా కూతురిని చదివించుకోవాలని’’ అంటూ వైద్యులను అతను వేడుకుంటున్నాడు. అయినప్పటికీ 25వ సర్జరీకి వైద్యులు సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఇతనికి ముందు ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కున్నారు. అయితే వారి విషయంలో కూడా శస్త్రచికిత్సలు పలించలేదని తెలుస్తోంది. 

అబుల్ బజందర్ సర్జరీకి ముందు.. ప్రస్తుతం

మరిన్ని వార్తలు