ఆయుధాల అమ్మకాల్లో అమెరికానే ఫస్ట్‌

29 Mar, 2018 15:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల అమ్మకాలు 1985 సంవత్సరం నుంచి తగ్గుతూరాగా, 2000 సంవత్సరం నుంచి అమ్మకాలు మళ్లీ ఊపందుకొని 2017 సంవత్సరం వరకు కొనసాగినట్లు స్టాక్‌హోమ్‌ పీస్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ సిప్రీ ఓ నివేదికలో వెల్లడించింది. 2013 నుంచి 2017 మధ్య కొనసాగిన ప్రధాన ఆయుధాల అమ్మకాలను పరిశీలిస్తే అంతకుముందు ఐదేళ్ల అమ్మకాల కన్నా పది శాతం అమ్మకాలు పెరిగాయి.

2013 నుంచి 2017 సంవత్సరాల మధ్య ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలు ప్రధాన ఆయుధాలను విక్రయించగా వాటిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, చైనా దేశాలు ముందున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 67 దేశాలు విక్రయించిన ఆయుధాల్లో 74 శాతం ఈ అయిదు దేశాలే విక్రయించడం గమనార్హం. 34 శాతంతో అమెరికా మొదటి స్థానంలో నిలవగా, 22 శాతంతో రష్యా రెండో స్థానంలో నిలిచింది. 2008 నుంచి 2012, 2013 నుంచి 2017 మధ్య ఆయుధాలు ఎక్కువగా ఆసియా, ఓసియానియా, మధ్య ప్రాచ్యానికి వెళ్లాయి. ఆఫ్రికా, అమెరికా, యూరప్‌లకు గణనీయంగా తగ్గాయి.
 
అమెరికా తన ఆయుధాలను 98 దేశాలకు విక్రయించగా వాటిలో 49 శాతం ఆయుధాలను మధ్యప్రాచ్యానికే విక్రయించింది. 34 శాతం ఆయుధాల అమ్మకాలతో ప్రపంచంలోనే అగ్రభాగాన నిల్చిన అమెరికా గత ఐదేళ్ల కాలంతో పోలిస్తే తన అమ్మకాలను 25 శాతం పెంచుకుంది. 1990వ దశకంతో పోల్చుకుంటే  ఒబామా హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగానే అమెరికా ఎక్కువ శాతం ఆయుధాలను అమ్మకలిగిందని సిప్రీ ఆమ్స్‌ అండ్‌ మిలిటరీ ఎక్స్‌పెండీచర్‌ ప్రోగామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఔడ్‌ ఫ్లూరంట్‌ తెలిపారు. రానున్న సంవత్సరాల్లో కూడా ప్రపంచంలోకెల్లా అమెరికా నుంచి ఆయుధాల అమ్మకాలు ఎక్కువ జరుగుతాయని, 2017లో అమెరికా కుదుర్చుకున్న పలు ఒప్పందాలు ఈ విషయాన్ని సూచిస్తున్నాయని ఆయన తెలిపారు.

2008 నుంచి 2012, 2013 నుంచి 2017 సంవత్సరాల మధ్య సాగిన అమ్మకాలను పరిశీలిస్తే రష్యా అమ్మకాలు 7. 1 శాతం పడిపోయాయి. ఫ్రాన్స్‌ అమ్మకాలు ఏకంగా 27 శాతం పెరిగాయి. ఆయుధాల అమ్మకాల్లో నాలుగవ పెద్ద దేశమైన జర్మనీలో కూడా 14 శాతం పడిపోయాయి. ఇదే కాలానికి చైనా అమ్మకాలు కూడా 19 శాతం పడిపోయాయి. చైనా నుంచి ఒక్క మయన్మార్‌ దేశమే 68 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకోగా రష్యా 15 శాతం ఆయుధాలను దిగుమతి చేసుకుంది.

మరిన్ని వార్తలు