సారీ.. నో ఫుడ్‌

28 Oct, 2018 02:22 IST|Sakshi

డిబ్సి.. ఇతడికి హోటళ్లలో నో ఎంట్రీ

ఫొటోలో కనిపిస్తున్న ఇతగాడి పేరు డిబ్సి(27). బ్రిటన్‌లోని మిడిల్స్‌బ్రో నగరవాసి. బరువు 254 కేజీలు. లావుగా ఉండటంతో మిడిల్స్‌బ్రాఫ్‌ నగరంలో ఈయనంటే తెలియని వారు లేరు. ఇప్పుడు ఆయన అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి ఎంత డబ్బు ఇచ్చినా సరే ఆహారం ఇవ్వడం లేదు. ఇతగాడికి ఆహారం నిషేధిస్తూ ‘సేవ్‌ డిబ్సి–ఒబెసిటీ ఈజ్‌ కిల్లింగ్‌ హిమ్‌’(డిబ్సిని కాపాడండి– స్థూలకాయం అతడిని చంపుతోంది’ అంటూ స్థానికంగా ఉన్న ప్రతి హోటల్లో బోర్డ్‌ పెట్టారు. దీంతో ఎవరూ అతడికి ఆహారం అమ్మడం లేదు. డిబ్సికి 18 ఏళ్ల వయసప్పుడు తండ్రి చనిపోవడంతో, కుంగిపోయి తెలియకుండానే ఎక్కువ తినడం అలవాటైంది. ఇంతలోనే అసాధారణంగా బరువు పెరిగిపోయాడు. దీంతో సాధారణ జీవితాన్ని కూడా ప్రశాంతంగా గడపలేకపోతున్నాడు. ఉద్యోగం దొరకడమూ.. కష్టమైంది. తన సైజ్‌ దుస్తులు దొరకక ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సి వస్తోంది. విమాన ప్రయాణం చేయాలంటే రెండు సీట్లు బుక్‌ చేసుకోవాల్సిందే. ఇటీవల డిబ్సికి గుండెపోటు రావడంతో వారం రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చింది. (డైట్‌ ఆర్‌ డై) తిండిపై నియంత్రణ లేకుంటే బతకడం కష్టమని వైద్యులు అతన్ని హెచ్చరించారు.  

వరంలా వచ్చిన మైక్‌... 
మైక్‌ హింద్‌.. యూకేలోనే సక్సెస్‌ఫుల్‌ పర్సనల్‌ ట్రైనర్‌. గతేడాది ఆయన బెస్ట్‌ పర్సనల్‌ ట్రైనర్‌గా కూడా ఎంపికయ్యాడు. అయితే, ఆయన ఏడాదికి ఒక్కరికి మాత్రమే శిక్షణనిస్తాడు. అదీ ఉచితంగా! దీంతో ఆయనకు ప్రతి ఏడాది వేలల్లో దరఖాస్తులు వస్తుంటాయి. వైద్యుల హెచ్చరికల తర్వాత ఏం చేయాలో తోచని డిబ్సి.. తన సంగతిని వివరిస్తూ మైక్‌ హింద్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇదేదో చాలెంజింగ్‌లా ఉందని భావించిన మైక్‌ ఈ ఏడాది డిబ్సినే ఎంచుకున్నాడు. అనుకోకుండా వచ్చిన ఈ చాన్స్‌ డిబ్సికి వరమనే అనుకోవాలి.  

మైక్‌కు సహకరిస్తున్న హోటళ్లు 
డిబ్సిని జిమ్‌కి తీసుకెళ్తే అతన్ని భరించగల మెషీన్లు అక్కడ కనపడలేదు. ఇక లాభం లేదనుకుని తిండి నుంచి నరుక్కురావాలని నిర్ణయించాడు మైక్‌. ఇందుకు ముందుగా విపరీతంగా (రోజుకు 11వేల కేలరీలు) తినే డిబ్సికి హోటళ్లు ఆహారం ఇవ్వకూడదని ప్రతి హోటల్‌ వద్ద బోర్డ్‌ పెట్టాడు. దీనికి ప్రతి హోటల్‌ సహకరిస్తుండటం గమనార్హం. అనారోగ్యకరమైన జంక్, ఫాస్ట్‌ ఫుడ్‌కు బదులు మైకే స్వయంగా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తున్నాడు. ఇప్పుడు డిబ్సి రోజుకు 3,500 కేలరీలు మాత్రమే తీసుకుంటున్నాడు. ఇందులో 2 వేల కేలరీల్ని మైక్‌ రూపొందించిన వ్యాయామాల ద్వారా కరిగిస్తున్నాడు. తాను మైక్‌కు రుణపడి ఉంటానని డిబ్సి ఆనందంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. ఏడాది తర్వాత డిబ్సి ఎలా తయారవుతాడో వేచి చూద్దాం!    

మరిన్ని వార్తలు