కృత్రిమంగా తయారు చేసింది కాదు!

19 Mar, 2020 06:05 IST|Sakshi

లాస్‌ ఏంజెలెస్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌–19 వ్యాధి కారక కరోనా వైరస్‌ పరిశోధనశాలలో కృత్రిమంగా తయారైంది కాదని, పరిణామ క్రమంలో భాగంగా ప్రకృతిలో సహజసిద్ధంగా పరిణమించిన సూక్ష్మజీవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గబ్బిలాల్లో ఉండిపోయి.. ఒకానొక సందర్భంలో మనుషులకు చేరిందని... తద్వారా లక్షల మందికి విస్తరించింనట్లు తాము అంచనా వేస్తున్నామని స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేచర్‌ మెడిసిన్‌ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ఇదే విషయాన్ని చెబుతోంది. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి)

కరోనా వైరస్‌తోపాటు సార్స్‌ తదితర వైరస్‌ల జన్యుక్రమాలను విశ్లేషించడం ద్వారా తామీ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ జన్యుక్రమంలో కృత్రిమంగా చేర్చిన భాగాలేవీ లేవని తద్వారా ఇది సహజసిద్ధంగా పరిణమించిన సూక్ష్మజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియాణ్‌ అండర్సన్‌ తెలిపారు. కరోనా వైరస్‌ మూలభాగం ఇతర వైరస్‌ల కంటే భిన్నంగా ఉందని... పైగా గబ్బిలాలు, పాంగోలిన్‌కు సంబంధించిన వైరస్‌లను పోలి ఉందని క్రిస్టియన్‌ వివరించారు. కోవిడ్‌–19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఇది మానవ నిర్మితమైందన్న వదంతులు చాలా వ్యాపించాయని, వాటన్నింటికీ తమ పరిశోధన స్పష్టమైన సమాధానం చెబుతోందని అన్నారు.  (కేసులు 2లక్షలు మరణాలు 8వేలు)

>
మరిన్ని వార్తలు