చైనాకు దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చిన పాక్‌..!

16 Nov, 2017 09:28 IST|Sakshi

బీజింగ్‌: మిత్రదేశం చైనాకు పాకిస్థాన్‌ దిమ్మతిరిగే ఝలక్‌ ఇచ్చింది. చైనా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపీఈసీ) విషయంలో ఆ దేశం ఆఫర్‌ను పాక్‌ తిరస్కరించింది. సీపీఈసీలో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో డైమర్‌-భాష డ్యామ్‌ నిర్మాణానికి 14 బిలియన్‌ డాలర్ల రుణాన్ని అందించేందుకు చైనా ముందుకురాగా.. పాక్‌ అందుకు నిరాకరించింది.

60 బిలియన్లతో చేపడుతున్న సీపీఈసీ నుంచి ఈ ప్రాజెక్టును తప్పించాలని, ఈ డ్యామ్‌ను తామే కట్టుకుంటామని పాక్‌ నేరుగా చైనాకే చెప్పినట్టు తెలుస్తోంది. భారత్‌ తన ప్రాంతంగా పేర్కొంటున్న పీవోకేలో ఈ డ్యామ్‌ నిర్మిస్తుండటంతో.. ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంకు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సైతం నిరాకరించాయి.

ఈ నేపథ్యంలో సీపీఈసీలో కీలకమైన ఈ డ్యామ్‌కు రుణమిచ్చేందుకు చైనా కంపెనీలు ముందుకొచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 5 బిలియన్‌ డాలర్ల నుంచి ఏకంగా 14 బిలియన్‌ డాలర్లకు పెంచడం.. ఈ మేరకు రుణం ఇచ్చేందుకు చైనా కంపెనీలు తీవ్రమైన షరతులు పెట్టడంతో పాక్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో చైనా షరతులు అంగీకరించడం ఎంతమాత్రం వీలు కాదని, అందుకే సొంతంగా ప్రాజెక్టు చేపడతామని పాకిస్థాన్‌ సర్కారు స్పష్టం చేసినట్టు ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఆ దేశ దినపత్రిక ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ వెల్లడించింది. డైమర్‌-భాషా డ్యామ్‌ విషయంలో చైనా పెడుతున్న షరతులు ఆమోదయోగ్యం కాదు.. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పాక్‌ వాటర్‌, విద్యుత్‌ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ముజామిల్‌ హుస్సేన్‌ స్పష్టం చేశారు.

ఈ ప్రాజెక్టుపై పాకిస్థాన్‌ తాజా వైఖరి చైనాను బిత్తరపోయేలా చేసింది. తమను సంప్రదించకుండా ప్రాజెక్టును పాక్‌ ఇలా ఊహించని ఝలక్‌ ఇస్తుందని తాము అనుకోవడం లేదని చైనా వర్గాలు అంటున్నాయి. మొత్తం సీపీఈసీ ప్రాజెక్టును ప్రమాదంలో పడేసేలా     చైనా ఆఫర్‌ను పాక్‌ తిరస్కరించలేదని ఆ దేశ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ప్రాజెక్టు యాజమాన్యం, నిర్వహణ, నిర్వహణ ఖర్చులు‌, భద్రత తామే చూసుకుంటామని చైనా కంపెనీలు పెడుతున్న షరతులు దేశ ప్రయోజనానికి భంగకరమని పాక్‌ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు