అమెరికాతో యుద్ధానికి సిద్ధం 

3 Aug, 2019 21:56 IST|Sakshi

మా దేశాన్ని చుట్టుముట్టి నిర్బంధిస్తే అమెరికాతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో హెచ్చరించారు. యుద్ధానికి తమ సేనలను సమాయత్తం చేస్తున్నామని ప్రకటించారు. అమెరికా చట్ట వ్యతిరేకమైన బెదిరింపులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ వెనెజులా వ్యవహారంలో రష్యా, చైనా, ఇరాన్‌, క్యూబాల జోక్యాన్ని తాము సహించమని, అందుచేతనే ఆ దేశాన్ని దిగ్బంధించే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు.

ట్రంప్‌ వ్యాఖ్యలపై మదురో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా బెదిరింపులు చూస్తుంటే ఆ దేశం తీవ్ర నిరాశ, చికాకులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా అమెరికా ఏ సైనిక చర్య తీసుకున్నా తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు. ‘నేర సామ్రాజ్యవాద దేశానికి నేనిచ్చే సందేశం ఇదే. ఎవరైనా మమ్మల్ని ముట్టడిస్తే యుద్ధానికి సిద్ధం కావడానికి మేం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వారు మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా, ఎన్ని ఆంక్షలు విధించినా మేం మరింత స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరిస్తాం’ అని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే అమెరికా వెనెజులాపై అనేక రకాల ఆంక్షలు విధించింది. దేశాధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత యువాన్‌ గ్వాయిడోను గుర్తిస్తున్నామని అమెరికా దాని మిత్ర పక్షాలు ప్రకటించడమే గాక మదురోను తొలగించడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. దీని ఫలితంగానే గత కొంతకాలంగా అధ్యక్ష కార్యాలయాన్ని గ్వాయిడో అనుచరులు స్వాధీనం చేసుకోవాలని చూస్తుండటంతో ప్రస్తుతం వెనెజులాలో ఘర్షణ వాతావారణం నెలకొంది.

మరిన్ని వార్తలు