విమానంలో ఐదుగురు ఎంపీలు, దారి మ​ళ్లింపు

5 Aug, 2019 19:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కోల్‌కతా నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానాన్ని సోమవారం అకస్మాత్తుగా దారి మళ్లించారు. ట్రాఫిక్, విమానంలో ఇంధనం తక్కువగా ఉన్న కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సలహా మేరకు కోల్‌కతా నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని అమృత్‌సర్‌కు మళ్లించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన అయిదుగురు ఎంపీలు కూడా ఉన్నారు.

ఎయిర్ ఇండియాకు చెందిన కోల్‌కతా-ఢిల్లీ విమానంలో (ఏఐ-021) మొత్తం 242 మంది ప్రయాణికులుండగా, ఇందులో బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మొత్తం ఐదుగురు ఎంపీలున్నారు. ఐదుగురు వీరంతా సోమవారం నాటి పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

కాగా జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 తోపాటు, ఆర్టికల్‌ 35ఏ రద్దు బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీఎస్‌పీ, వైసీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌, ఏఐడీఎంకే, ఆప్‌ ఎంపీలు బిల్లుకు మద్దతు తెలుపగా.. కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేంచారు. దీనికి నిరసనగా రాజ్యసభ నుండి వాకౌట్ చేశారు. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేశారు. మరోవైపు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రాజ్యసభ సోమవారం సాయంత్రం ఆమోదించింది. 

>
మరిన్ని వార్తలు