అంఫ‌న్‌: ప‌్ర‌భావితం కానున్న ఆరు జిల్లాలు

19 May, 2020 17:07 IST|Sakshi

భువ‌నేశ్వ‌ర్‌: మ‌రింత తీవ్ర రూపం దాల్చిన అంఫ‌న్ తుపాను రేపు(బుధ‌వారం) తీరం దాటనుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ఇదివ‌ర‌కే వెల్ల‌డించింది. దిఘా (పశ్చిమ బెంగాల్), హతియా దీవులు (బంగ్లాదేశ్) మధ్య తీరం దాటే స‌మ‌యంలో 155 నుంచి 165 కి.మీ వేగంతో ప్ర‌చండ‌ గాలులు వీస్తాయ‌ని తెలిపింది. అంఫ‌న్ తుపాను వ‌ల్ల‌ ఒడిశాలోని ఆరు జిల్లాలు తీవ్ర‌ ప్ర‌భావితం కానున్నాయ‌ని ఐఎమ్‌డీ హెచ్చ‌రించింది. తీరం దాటిన వెంట‌నే కేంద్ర‌పారా, భ‌ద్ర‌క్‌, మ‌యూర్‌భంజ్‌, జైపూర్‌, జ‌గ‌త్‌సింగ్‌పూర్ జిల్లాల్లో తుపాను బీభ‌త్సం అధికంగా ఉంటుంద‌ని ఐఎండీ డిప్యూటీ డైరెక్ట‌ర్ ఉమాశంక‌ర్ దాస్ తెలిపాడు. (డిఘ-హతియా వద్ద తీరం దాటనున్న అంఫాన్)

కాగా నేడు సాయంత్రం నుంచే ఒడిశా తీరం వెంబడి ఉన్న గజపతి, గంజాం, పూరి, జగత్‌సింగ్‌ పూర్, కేంద్రపార జిల్లాల్లో తీవ్రమైన గాలులు వీస్తూ అంఫ‌న్ ప్ర‌భావాన్ని చూపుతోంది. 'అంఫన్' తుపాను ప్ర‌భావం అధికంగా ఒడిశాతో పాటు ప‌శ్చిమ బెంగాల్‌పైనా ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. ఈ మేర‌కు రెండు రాష్ట్రాల్లోని ల‌క్ష‌లాది తీరప్రాంత వాసుల‌ను సురక్షిత ప్రాంతాలకు త‌ర‌లించారు. కాగా ఒడిశాలోని పారాదీప్‌కు ద‌క్షిణంగా 520 కిలో మీట‌ర్ల దూరంలో ఈ తుపాను కేంద్రీకృతమై ఉంది. గత రెండు దశాబ్దాల కాలంలో బంగాళాఖాతంలో సూపర్‌ సైక్లోన్‌ ఏర్పడటం రెండోసారి కావడం గమనార్హం. (అతి తీవ్ర తుపానుగా అంఫన్‌)

మరిన్ని వార్తలు