అరుణాచల్, అస్సాంలలో వరదలు

1 Sep, 2018 05:28 IST|Sakshi

ఇటానగర్‌: చైనాలోని బ్రహ్మపుత్ర నదిలో నీటిమట్టం పెరగడంతో అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ దీవిలో చిక్కుకున్న 19 మందిని శుక్రవారం వాయుసేన సిబ్బంది హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అస్సాంలోని ధేమ్‌జీ జిల్లాలో జాతీయ విపత్తు ప్రతిస్పందనా బృందం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందనా బృందాలు 200 మందిని కాపాడాయి.

అస్సాంకు చెందిన పశువులకాపరులు అరుణాచల్‌లోని తూర్పు సియాంగ్‌ జిల్లా వరదల్లో చిక్కుకోగా, జిల్లా అధికారుల విజ్ఞప్తి మేరకు వైమానిక దళ సిబ్బంది వారిని కాపాడింది. అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మేఘాలయలోని మూడు జిల్లాలకూ వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. చైనాలో సాంగ్పోగా పిలిచే నది దిగువ వైపునకు ప్రవహించి లోహిత్, దిబాంగ్‌ నదులతో కలసి అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు