ఆహార పొట్లాలపై 'అమ్మ' చిత్రాలు!

7 Dec, 2015 08:24 IST|Sakshi
ఆహార పొట్లాలపై 'అమ్మ' చిత్రాలు!

చెన్నై: ప్రజలను తీవ్ర విషాదంలో ముంచిన విపత్తులోనూ రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారా? అంటే తమిళనాడులోని పరిస్థితి చూస్తే ఔననే అనిపిస్తున్నది. వర్షాలకు అల్లాడిన చెన్నైలో బాధిత ప్రజలకు అందజేస్తున్న సహాయక సామాగ్రిపై అధికార అన్నాడీఎంకే చెందిన శ్రేణులు బలవంతంగా ముఖ్యమంత్రి జయలలిత చిత్రాలు అతికిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 'అన్నాడీఎంకే శ్రేణులు మా వాహనాలను నిలిపివేశారు. మమ్మల్ని బెదిరించి బలవంతంగా బాధితులకు అందజేసేందుకు ఉద్దేశించిన బియ్యం బ్యాగులు, ఆహార పొట్లాలపై స్టిక్కర్లు అతికించారు. ఇది దారుణమైన చర్య. ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు' అని సంతోష్ అనే వాలంటీర్ తెలిపారు.

ప్రస్తుత విషాద సమయంలోనూ రాజకీయ ప్రయోజనాలకోసం ఇలాంటి చెత్త చర్యలకు పాల్పడటం సరికాదని మరో వాలంటీర్ తెలిపారు. బాధిత ప్రజల కోసం తీసుకెళ్తున్న సహాయక సామగ్రిపై 'అమ్మ'గా పేరొందిన జయలలిత స్టిక్కర్లు ఉండటం తీవ్ర వివాదాన్ని సృష్టించింది. ఈ ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే అన్నాడీఎంకే నేతలు మాత్రం ఇది తమ చర్య కాదని అంటున్నారు. పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ఎవరో దుండగులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని, దీనిపై అన్నాడీఎంకే అధికారిక ప్రకటన విడుదల చేయనుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ నేత తెలిపారు. అయితే ఇప్పటివరకు అలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ అనుచరులు మాత్రం అన్నాడీఎంకే శ్రేణుల చర్యలను తప్పుబడుతూ మరిన్ని ఫొటోలు విడుదలచేశారు.

మరిన్ని వార్తలు