అణచివేత చర్యలు ముమ్మరం

27 Dec, 2014 02:44 IST|Sakshi
అణచివేత చర్యలు ముమ్మరం
  • బోడో మిలిటెంట్లపై సైనిక కార్యాచరణ ఉధృతం: ఆర్మీ చీఫ్
  • అవసరమైతే మరింత సైన్యాన్ని మోహరిస్తామని వెల్లడి
  • తీవ్రవాదుల కోసం ఆర్మీ హెలికాప్టర్లతో విస్తృతంగా గాలింపు
  • న్యూఢిల్లీ/కోల్‌కతా/గువాహటి: అస్సాంలోని ఆదివాసీలపై దారుణ మారణకాండకు పాల్పడిన బోడో తీవ్రవాదులపై అణచివేత చర్యలను మరింత తీవ్రతరం చేయనున్నట్లు సైన్యం ప్రకటించింది. అవసరమైతే మరిన్ని బలగాలను రంగంలోకి దింపుతామని, త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని వెల్లడించింది. స్థానిక పోలీసులతో పాటు మిలటరీ, పారా మిలటరీ బలగాలు తీవ్రవాదుల కోసం గాలిస్తున్నాయని.. ఆర్మీ హెలికాప్టర్లను కూడా ఇందుకు వినియోగిస్తున్నామని తెలిపింది.

    మిలిటెంట్ల దాడులను నిరసిస్తూ ఆదివాసీ సెంగెల్ అభియాన్ ఆధ్వర్యంలో అస్సాంలో పలు రహదారులను ఆదివాసీలు నిర్బంధించారు. దీంతోపాటు వివిధ సంస్థలు ఇచ్చిన బంద్‌పిలుపు కారణంగా శనివారం అస్సాం రాష్ట్రవ్యాప్తంగా జన జీవనం స్తంభించి పోయింది. మరోవైపు.. వచ్చే 31వ తేదీన ఐదు రాష్ట్రాల బంద్‌కు ఆదివాసీ సెంగెల్ అభియాన్ పిలుపునిచ్చింది.

    ఇక బోడో తీవ్రవాద సంస్థ ‘నేషనల్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్’పై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్లు పొడిగించింది. అస్సాంలో పరిస్థితికి సంబంధించి ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు.

    మిలిటెంట్ల దాడులు వ్యాప్తిచెందకుండా చర్యలు చేపట్టాలని ఆర్మీ చీఫ్‌కు మంత్రి సూచించారు. అవసరమైతే భూటాన్, మయన్మార్‌ల సాయం తీసుకోవాలని కూడా సూచించినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ విలేకరులతో మాట్లాడారు. బోడో తీవ్రవాదులపై కార్యాచరణను మరింత ఉధృతం చేస్తామన్నారు. శనివారం ఆయన అస్సాంలో పర్యటించనున్నారు.
     
    81కి పెరిగిన మృతులు..

    బోడో తీవ్రవాదుల మారణకాండలో మృతిచెందిన ఆదివాసీల సంఖ్య శుక్రవారం నాటికి 81కి చేరుకుంది. మరొకరి మృతదేహాన్ని ఘటనా స్థలంలో శుక్రవారం ఉదయం గుర్తించారు. అస్సాంలోని కొక్రాఝర్, చిరాంగ్, సోనిట్‌పూర్, ఉదల్‌గురి జిల్లాల్లో ఏర్పాటు చేసిన 61 క్యాంపుల్లో దాదాపు 73 వేల మంది ఆశ్రయం పొందుతున్నట్లు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సీఈవో పీకే తివారీ చెప్పారు. మరోవైపు బోడో తీవ్రవాదుల దుశ్చర్యకు నిరసనగా అస్సాంకు చెందిన ఆదివాసీలు శుక్రవారం రహదారులను దిగ్బంధించారు. ఆదివాసీ సెంగెల్ అభియాన్ ఆధ్వర్యంలో మాల్దా-బాలుర్‌ఘాట్ రహదారిని, గజోల్ బామున్‌గొలా రహదారిని దిగ్బంధించారు. దీంతో పశ్చిమ బెంగాల్ వైపు నుంచి వెళ్తున్న వందలాది వాహనాలు మాల్దా వద్ద నిలిచిపోయాయి.
     

మరిన్ని వార్తలు