ముగిసిన పార్లమెంటు సమావేశాలు

13 Aug, 2016 03:21 IST|Sakshi
ముగిసిన పార్లమెంటు సమావేశాలు

లోక్‌సభలో 13, రాజ్యసభలో 14 బిల్లులకు పచ్చజెండా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లుకు ఆమోదం, జమ్మూ కశ్మీర్ అంశంపై ఏకాభిప్రాయ తీర్మానం ఈసారి సమావేశాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాలు.  దిగువ సభలో 13 బిల్లులు, ఎగువ సభలో 14 బిల్లులు ఆమోదం పొందాయి. జీఎస్టీ బిల్లుతో సహా బినామీ లావాదేవీల బిల్లు,  పన్ను చట్టాల(సవరణ) బిల్లు, ఫ్యాక్టరీల(సవరణ) బిల్లు, ఉద్యోగుల పరిహారం(సవరణ) బిల్లు, భారత వైద్య మండలి(సవరణ) బిల్లులకు మోక్షం లభించింది. జూలై 18వ తేదీన ప్రారంభమైన సమావేశాల్లో రాజ్యసభ 20 సిట్టింగుల్లో 112 గంటలు ,లోక్‌సభ 121 గంటల పాటు కార్యకలాపాలు జరిపాయి.

లోక్‌సభలో ...కశ్మీర్ లోయలో పరిస్థితి, ధరల పెరుగుదల, దళితులపై అకృత్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు తదితరాలపై ప్రముఖంగా చర్చలు జరిగాయి. రాజ్యసభ స్వల్ప కాలిక చర్చ జరిపిన వాటిలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు, ఉత్తరాఖండ్, అరుణాచల్‌ప్రదేశ్‌లో పరిణామాలు, విద్యా విధానం ముసాయిదా తదితరాలున్నాయి. ఈ సమావేశాలు ఫలవంతమయ్యాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ  మంత్రి అనంత్‌కుమార్ చెప్పారు. లోక్‌సభ పనితీరు రాజ్యసభ కన్నా బాగుందని, కాని అది బడ్జెట్ సమావేశాలతో పోల్చుకుంటే తక్కువేనని  ఆయన అన్నారు.

>
మరిన్ని వార్తలు